రోహతక్: హర్యానాకు చెందిన సీనియర్ పోలీసు ఆఫీసర్, ఐజీపీ వై పూరన్ కుమార్(IGP Puran Kumar) ఆత్మహత్య చేసుకున్నారు. సెక్టార్ 11 లో ఉన్న తన ఇంట్లోనే ఆయన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. 2001 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన కుమార్.. రోహతక్‌లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంటి ఆవరణలో ఉన్న సౌండ్‌ప్రూఫ్ బేస్మింట్‌లో ఆయన ఆత్మహతకు పాల్పడ్డారు. రక్తపుమడుగులో ఉన్న ఆయన మృతదేహాన్ని కూతురు గుర్తించింది. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు ఆమె పోలీసులకు సమాచారం చేరవేసింది. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటగిరీకి చెందిన రెండు బృందాలు దర్యాప్తు చేపడుతున్నాయి.
ఆత్మహత్యకు పాల్పడిన ప్రదేశం నుంచి వెపన్ రికవరీ చేశారు. సుమారు 4 గంటల దర్యాప్తు తర్వాత పోలీసు ఆఫీసర్ పార్దీవ దేహాన్ని క్రైం స్పాట్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూరన్ కుమార్ భార్య కూడా ఆఫీసరే. అన్మీత్ పీ కుమార్.. 2001 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఫారిన్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో కమీషనర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె జపాన్ పర్యటనలో ఉన్నారు. హర్యానా సీఎం నవాబ్ సింగ్ సైనీ బృందంతో కలిసి విదేశీ టూరుకు వెళ్లారు.
పూరన్ కుమార్ తలలో నుంచి దూసుకెళ్లిన బుల్లెట్‌ను తీసేందుకు పోలీసులకు మూడు గంటల సమయం పట్టింది. ఆ బుల్లెట్ మల్టీలేయర్ ప్లైవుడ్లో చిక్కుకున్నది. దాన్ని ఓపెన్ చేసేందుకు ప్లైవుడ్ వర్కర్‌ను పిలిపించారు. కుమార్‌కు చెందిన మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారు. పూరన్ కుమార్ తలపై గాయాల మచ్చలు ఉన్నట్లు చండీఘడ్ ఎస్ఎస్పీ కన్వర్దీప్ కౌర్ తెలిపారు. వీలునామాతో పాటు ఫైనల్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో అనేకసార్లు హర్యానా పోలీసు శాఖ వైఖరిని ఖండిస్తూ ఐజీ పూరన్ కుమార్ ఫిర్యాదు చేశారు.
ఐపీఎస్‌ల ప్రమోషన్ల విషయంలో గత ఏడాది నిర్వహించిన స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌లను వ్యతిరేకిస్తూ చీఫ్ సెక్రటరీ టీవీఎస్ఎన్ ప్రసాద్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. పూరన్ ఫిర్యాదు వల్ల పలుమార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశాలను రద్దు చేశారు. తనకు కారును కేటాయించలేదని గత ఏడాది సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. బదిలీ అయినా కూడా కొందరు ఆఫీసర్లకు స్టేషన్ల వద్దే అకామిడేషన్ ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ఆ ఫిర్యాదు మూలంగా ఓ హెచ్‌పీఎస్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకున్నారు.
రెండేళ్ల క్రితం పూరన్‌ను హోం గార్డ్స్ ఐజీగా ట్రాన్స్ఫర్ చేశారు. అదేమీ క్యాడర్ పోస్టు కాదు అని ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత 9 నెలలకు అతనిక క్యాడర్ పోస్టు ఇచ్చారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ ఎస్సీ కమీషన్‌ను ఆశ్రయించారు. తన ఫిర్యాదులో కుల ఆరోపణలు చేశారాయన. డీజీపీ మనోజ్ యాదవ్‌కు వ్యతిరేకంగా 2021లో పంజాబ్, హర్యానా హైకోర్టుకు వెళ్లారు. హర్యానా పోలీసు అకాడమీ ఐజీపీ పోస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనను రోహతక్ రేంజ్ ఐజీపీగా బదిలీ చేశారు. 5 నెలల క్రితమే రోహతక్ పోలీసు ట్రైనింగ్ కాలేజీకి ఐజీగా ట్రాన్స్ఫర్ చేశారు.