Defeat BJP | త్వరలో జరుగనున్న అదమ్‌పూర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించేందుకు రైతులు సిద్ధమయ్యారు. బైఎలక్షన్స్‌లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్పేందుకు హర్యానా రైతులు ఏకమవుతున్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు అవసరమైతే ఉమ్మడి అభ్యర్థిని నిలిపాలని, లేదంటే మరే పార్టీ అభ్యర్థికి మద్దతు పలకాలని రైతులు ఏకాభిప్రాయానికి వచ్చారు. రైతులను ఏకం చేసి బీజేపీపై సమరశంఖం పూరించేందుకు యునైటెడ్ కిసాన్ మోర్చా కార్యాచరణ సిద్ధం చేసుకున్నది.
ఉద్యమం సమయంలో రైతులతో చేసుకున్న ఒప్పందాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ నెరవేర్చలేదు. దాంతో ఉప ఎన్నికలు జరుగుతున్న అన్ని స్థానాల్లో బీజేపీకి వ్యతిరేకంగా రైతులు ప్రచారం చేస్తున్నారు. హర్యానా ఆదమ్పూర్ ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలని రైతు నాయకుడు గుర్నాం సింగ్ ఛారుని రైతులకు పిలుపునిచ్చారు. ‘బీజేపీని ఓడించి గుణపాఠం చెప్దాం. అవసరమైతే మన నుంచే అభ్యర్థిని నిలుపుదాం. లేదంటే మనకు అండగా నిలిచే మరో పార్టీ అభ్యర్థికి మద్ధతుగా ఉందాం. ఏది ఏమైనా బీజేపీని ఓడించాల్సిందే..’ అంటూ రైతు నాయకుడు, సంయుక్త సంఘర్ష్ పార్టీ వ్యవస్థాపకుడు గుర్నాం సింగ్ ఛారుని పిలుపునిచ్చారు. ఉదమ్‌పూర్ నియోజకవర్గం పరిధిలోని బర్వాలాలో రైతులతో సమావేశమై వారిని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేలా రేకెత్తిస్తున్నారు.
ఉదమ్‌పూర్ ఉప ఎన్నికలో బీజేపీ-జేజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భవ్య బిష్ణోయ్ పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో రైతులను మోసం చేసిన బీజేపీకి రైతులు గుణపాఠం చెప్పారు. ఇప్పుడు ఉదమ్పూర్తో పాటు అన్ని ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు రైతులు ముందుకురావాలని రైతు నేతలు పిలుపునిస్తున్నారు. రైతుల డిమాండ్లు పరిష్కారం కావాలంటే బీజేపీని ఓడించక తప్పదని రైతు నాయకులు అంటున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి బీజేపీలో చేరిన భవ్య బిష్ణోయ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ జైప్రకాష్ రంగంలో నిలిచారు.