చండీగఢ్: మహీంద్రా ‘థార్’ ఎస్యూవీ డ్రైవర్లు రహదారులపై అతి వేగంగా నడుపుతూ, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని హర్యానా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓపీ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రాఫిక్ తనిఖీ విధానాలపై మీడియాతో మాట్లాడిన ఆయన థార్ వాహనాలను చూస్తే వదిలిపెట్టడం కష్టమని, వాటిని నడిపే వారు రోడ్డుపై విన్యాసాలు చేస్తుంటారని పేర్కొన్నారు. ఆ వాహనాలను స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారన్నారు. ‘ఇది కారు కాదు.. నేను ఇలాంటి వాడిని’ అని చెప్పే ప్రకటన లాంటిదని అభివర్ణించారు. థార్ వాహనాల్లో ప్రయాణికులు రూఫ్‌పై కూర్చోవడం, సైడ్బోర్డ్లపై నిలబడటం వంటి ప్రమాదకరమైన చర్యల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పోలీసు అధికారి కొడుకు థార్ నడుపుతూ ఒకరిని ఢీకొట్టిన ఘటనను గుర్తుచేస్తూ, బాధ్యతారాహిత్యంగా నడిపితే వాహనాలు దుర్వినియోగమవుతాయని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా డీజీపీ సరదాగా మాట్లాడుతూ థార్ కొనుగోలు చేసే పోలీసు అధికారులు కూడా ‘కొంచెం పిచ్చివారు’ అయి ఉంటారని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. ఇటీవల థార్ వాహనాలను ప్రమాదకరమైన స్టంట్లకు ఉపయోగించడం, అతివేగంతో నడపడం వంటివి పెరగడంతో రాష్ట్ర యంత్రాంగం వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది.