Haryana Nuh Violence | చండీగఢ్/న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ కేంద్రంగా చెలరేగిన హింసపై ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరూ హామీ ఇవ్వలేరని, ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ రక్షించలేదంటూ వ్యాఖ్యానించారు. ‘పోలీసులు కానీ ఆర్మీ గానీ ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించలేరు’ అని పేర్కొన్నారు. దీనిపై విలేకర్లు ప్రశ్నించగా.. సీఎం ఖట్టర్ ఆ వెంటనే మాట మార్చారు. తన స్టేట్మెంట్ను తప్పుగా అర్థం చేసుకొన్నారని, ప్రజలకు రక్షణ కల్పించడంలో భద్రతా బలగాలతో పాటు ప్రజల మధ్య సామరస్యం ఉండటం కూడా ముఖ్యమని చెప్పుకొచ్చారు. అల్లర్లలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారని తెలిపారు. .
అల్లరిమూకల నుంచే పరిహారం
అల్లరి మూకల నుంచే బాధితులు పరిహారం పొందుతారని ఖట్టర్ అన్నారు. హింసకు కారణాలు, బజరంగ్ దళ కార్యకర్త మోను మనేసర్ పాత్రపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని డీజీపీ పీకే అగర్వాల్ వెల్లడించారు. హర్యానా ఘటనపై వీహెచ్‌పీ, బజరంగ్దళ్ బుధవారం నోయిడాతో పాటు ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించింది.
తక్షణ విచారణకు అత్యవసర బెంచ్
హర్యానాలో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో వీహెచ్‌పీ, బజరంగ్దళ్ పిలుపునిచ్చిన ర్యాలీలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.. ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణను నిలిపేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది సీయూ సింగ్ అభ్యర్థన మేరకు వెంటనే ఇద్దరు న్యాయమూర్తులతో ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేశారు. ర్యాలీలపై నిషేధం విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. ర్యాలీల్లో హింస చెలరేగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.