చండీగఢ్, ఏప్రిల్ 3: సుప్రీంకోర్టుపైనా, కొలీజియంపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలు తరచుగా దురుసు వ్యాఖ్యలు చేస్తుండగా.. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, నేతలూ అదే దారిలో నడుస్తున్నారు. ఏకంగా న్యాయమూర్తులపై బెదిరింపు వ్యాఖ్యలు చేస్తున్నారు. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్.. తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఓ జడ్జితో సమస్య ఉన్నదని, ఆయనను తాము దారికి తెస్తామని బెదిరించేలా ఖట్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఖట్టర్ తెలిపారు. ఖట్టర్ ఆదివారం భివాని జిల్లాలోని ఖరాక్ కలాన్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో ఆలస్యాన్ని కొంతమంది ప్రస్తావించారు. దీంతో ఖట్టర్ స్పందిస్తూ.. ‘ఆందోళన చెందకండి. సమస్యను పరిష్కరిస్తాం. ఓ జడ్జితో సమస్య ఉన్నది.
ఆయనను దారికి తెస్తాం’ అని వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థనే బెదిరింపులకు గురిచేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి. సీఎం వ్యాఖ్యలు హైకోర్టు న్యాయమూర్తి పనిలో జోక్యం చేసుకొనేలా, బెదిరింపులకు పాల్పడేలా ఉన్నాయని మండిపడ్డాయి. ఖట్టర్ వ్యాఖ్యలు అహంకారపూరితమైనవని, వెంటనే న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. న్యాయమూర్తిపై ఖట్టర్ వాడిన భాష.. బీజేపీ, ఆరెస్సెస్‌కు న్యాయవ్యవస్థపై ఉన్న భావాన్ని ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా న్యాయవ్యవస్థను టార్గెట్‌గా చేసుకొని మాట్లాడుతుంటారని, హర్యానాలో ఆ పాత్రను సీఎం ఖట్టర్ తీసుకొన్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఖట్టర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొన్నారు. ‘అసహజంగా వచ్చిన వ్యాఖ్యలు అవి. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు’ అని వివరణ ఇచ్చారు.