షిమ్లా: హర్యానా బీజేపీ అధ్యక్షుడు మోహన్‌లాల్ బడోలిపై (Mohanlal Badoli) రేప్ కేసు నమోదయింది. ఆయనతోపాటు రాకీ మిట్టల్ అకా జై భగవాన్ అనే గాయకుడు తనపై సామూహిక లైంగికదాడి చేశారంటూ ఢిల్లీకి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2023, జూలై 3న ఈ ఘటన జరిగినట్లు యువతి పేర్కొన్నది. తన యజమాని, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలీకి వచ్చినప్పుడు బలాత్కారం చేశారని వెల్లడించింది. ఈ ఘటనపై గతేడాది డిసెంబర్ 13న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది. ఆ ఫిర్యాదులో ఏమున్నదంటే..
‘తన బాస్, స్నేహితురాలితో కలిసి హిమాచల్‌ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా కసౌలీకి పర్యాటకురాలిగా వెళ్లాను. 2023, జూలై 3న నిందితులిద్దరు తమకు కలిశారు. బడోలి తనను తాను ఓ సీనియర్ రాజకీయ నాయకుడినని, తాను సింగర్‌ను అంటూ రాకీ పరిచయం చేసుకున్నారు. తాను తీయబోయే ఆల్బమ్‌లో నటిగా అవకాశం కల్పిస్తానని మిట్టల్, తనకు పెద్ద స్థాయిలో పరిచయాలు ఉన్నాయని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇద్దరు కలిసి తమను ప్రలోభ పెట్టారు.
అనంతరం తమకు బలవంతంగా మద్యం తాగించారు. నా స్నేహితురాలిని బెదిరించి పక్కకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాపై ఇద్దరూ కలిసి లైంగికదాడికి పాల్పడ్డారు. నా నగ్న చిత్రాలు, వీడియోలు తీశారు. దానిని చూపించి ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించారంటూ’ బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, నిందితులపై 376డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని సోలన్ ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు.