న్యూఢిల్లీ, జనవరి 10: వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారాలు సైతం ఆఫీసుకు రావాలని ఎల్అండ్టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. తెలివిగా పని చేయాలని, బానిసగా కాదని ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా వ్యాఖ్యానించారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘వారానికి 90 గంటల పనా? సన్‌డేను సన్-డ్యూటీగా పేరు మార్చి, డేఆఫ్ అనే దానిని కల్పిత ఆలోచన చేద్దామా?’ అంటూ ఆయన మండిపడ్డారు. ‘కష్టపడటంతో పాటు తెలివిగా పని చేయాలని నేను నమ్ముతాను. కానీ, జీవితాన్ని ఆఫీస్ షిఫ్ట్‌గా మార్చడం విజయానికి కాకుండా అలసటకు కారణమవుతుంది. పని-జీవన సమతుల్యం అనేది ఐచ్ఛికం కాదు.. అవసరం. తెలివిగా పని చేయండి. బానిసలా కాదు’ అని ఆయన పేర్కొన్నారు.
‘సీనియర్ స్థాయిల్లో ఉండే ఇలాంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది’ అని నటి దీపికా పడుకోన్ వ్యాఖ్యానించారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ ఎల్అండ్టీ ఒక ప్రకటన ఇచ్చింది. ‘ఈ దశాబ్దం భారత్‌దేనని, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు సమష్ఠి కృషి అవసరమనేది మేము నమ్ముతున్నాం. మా చైర్మన్ వ్యాఖ్యలు ఈ గొప్ప లక్ష్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి’ అని పేర్కొన్నది. ఈ వివరణపైనా విమర్శలొచ్చాయి. ఈ వివరణపై మరోసారి స్పందించిన దీపికా.. ‘వీరు మరింత దిగజార్చారు’ అని కామెంట్ చేశారు.