దేవస్, అక్టోబర్ 3 : చేతులు, కాళ్లు కట్టేసి, గార్బా వస్త్రధారణలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఓ యువతి మృతదేహాన్ని మధ్యప్రదేశ్ పోలీసులు కనుగొన్నారు. తానే ఈ హత్యచేసినట్లు అంగీకరిస్తూ ఆ యువతి బాయ్‌ఫ్రెండ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ అమానుష సంఘటన మధ్యప్రదేశ్‌లోని దేవస్లో జరిగింది. ఈ నెల 1వ తేదీన(బుధవారం) వైశాలీ అవెన్యూ కాలనీలోని ఓ అద్దె ఇంటి తలుపులు పగలగొట్టి పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న లక్షితా చౌదరి అనే యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గార్బా దుస్తులలోనే ఉన్న ఆమె రెండు చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. ఆమె మృతదేహం నీటి డ్రమ్ము పక్కన పడి ఉంది. సెప్టెంబర్ 29న కాలేజీకని ఇంటి నుంచి బయల్దేరిన లక్షిత సాయంత్రం దాటినా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. తమ కుమార్తెకు మోనూ చౌహాన్ అనే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తెలియడంతో వెంటనే సిటీ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించి తమ కుమార్తె కనపడడం లేదని ఫిర్యాదు చేశారు.
మోనూ మొబైల్ నంబర్‌కు వారు ఫోన్ చేయగా తాను, లక్షిత కలిసే ఉన్నామని, ప్రయాణం చేస్తున్నామని వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా వారిని తప్పు దారి పట్టించాడు. లక్షితను తాను హత్య చేసినట్లు బుధవారం మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పిన మోనూ మృతదేహం గురించి సమాచారం అందించాడు. వేరే వ్యక్తితో లక్షిత సన్నిహితంగా తిరుగుతోందన్న అనుమానంతోనే తాను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకుని పోలీసులకు లొంగిపోయాడు. ఏడాది నుంచి తనకు లక్షితకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని అక్టోబర్ 8 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.