ఇంఫాల్: ఒక కాలేజ్ గేట్ వద్ద హ్యాండ్ గ్రెనేడ్తోపాటు ఒక లెటర్ కనిపించింది. (Hand Grenade With Note) ఫాసిస్ట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని అందులో ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నారు. ఆ గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేశారు. కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించడం కోసం ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఈ సంఘటన జరిగింది. సోమవారం ఉదయం 6 గంటల సమయంలో గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ సమీపంలోని ఘనప్రియ మహిళా కళాశాల గేట్ వద్ద ఒక లెటర్‌పై ఉంచిన హ్యాండ్ గ్రెనేడ్ కనిపించింది. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే ఆ కాలేజీ వద్దకు చేరుకున్నారు. గ్రెనేడ్‌ను నిర్వీర్యం చేశారు. ఆ నోట్‌ను పరిశీలించారు. ‘ఫాసిస్ట్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయాలి, శ్రామికవర్గ విద్యార్థుల ఉద్యమాన్ని, విద్యా హక్కును గౌరవించాలి, విద్యార్థులను కీర్తించాలి’ అని ఆ నోట్లో రాసి ఉన్నట్లు గమనించారు. ఆ కాలేజ్ యాజమాన్యాన్ని బెదిరించడం కోసం గేట్ వద్ద గ్రెనేడ్ ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.