Opposition Meet | న్యూఢిల్లీ, జూన్ 24: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి కేంద్రంలోని బీజేపీని గద్దె దించాలని విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సరైన చిత్తశుద్ధి లేకుండా, సొంత ఎజెండాలతో సమావేశాలకు హాజరైన పార్టీలు తలోదారిలో పయనిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంపై మద్దతు తెలిపే విషయంలో ఆప్, కాంగ్రెస్ మధ్య పంచాయితీ నడుస్తుండగా, తాజాగా కేరళలో సీపీఐ(ఎం), కాంగ్రెస్ మధ్య మరో తగాదా పుట్టుకొచ్చింది. కేరళ పీసీసీ అధ్యక్షుడు సుధాకరన్ అరెస్టును ఆ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు విపక్షాల భేటీ అనంతరం జరిగిన విలేకర్ల సమావేశానికి ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీల సొంత ఎజెండాల మధ్య విపక్షాలు ఒక్కతాటిపైకి రావడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఐక్యతపై నీలినీడలు కమ్ముకొన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. విపక్ష పార్టీల ఐక్యత ఎంతవరకు వెళ్తుందో వేచిచూడాలి.
బీహార్‌లో శుక్రవారం జరిగిన విపక్షాల భేటీలో ఢిల్లీ ఆర్డినెన్స్‌పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పట్టుబట్టినట్టు తెలుస్తున్నది. దీంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో దీనిపై కాంగ్రెస్ ఓ నిర్ణయానికి రాకపోవడంతో భవిష్యత్తులో జరిగే భేటీకి ఆప్ గైర్హాజరు అయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతోపాటు పార్లమెంట్లో ఓటింగ్ సందర్భంగా వాకౌట్ చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నదని ఆ పార్టీ నేతలు చిట్‌చాట్‌లో చెప్పినట్టు ఆప్ దృష్టికి వచ్చింది. దీంతో వాకౌట్ చేయడమంటే పరోక్షంగా బీజేపీకి మద్దతు తెలపడమేనని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండాలని విపక్షాల భేటీలో నిర్ణయించినట్టు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తెలిపారు.
బీహార్‌లో జరిగిన విపక్షాల భేటీకి తమ పార్టీకి ఎందుకు ఆహ్వానం అందలేదో తనకు తెలియదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. భారత్‌లో ముస్లింలపై వివక్ష చూపడం లేదని అమెరికాలో మోదీ చెప్పిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఔరంగాబాద్‌లో ఆ పార్టీ ఎంపీ జలీల్‌తో కలిసి ఒవైసీ మాట్లాడారు.