H1B Visa | న్యూఢిల్లీ, నవంబర్ 25: మంచి జీతం, మెరుగైన జీవితాన్ని అందించే అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి. హెచ్1బీ వీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. విదేశీ గ్రాడ్యూయేట్లు, నిపుణులకు తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు హెచ్1బీ వీసాలను స్పాన్సర్ చేస్తాయి. ఈ వీసాలు ఉంటే ఆరేండ్ల పాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పని చేసే వీలుంటుంది. అయితే, 2023తో పోల్చితే 2024లో హెచ్1బీ వీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి. ఎక్కువ హెచ్1బీ వీసాలు స్పాన్సర్షిప్ చేసే మొదటి 15 కంపెనీల్లో దాదాపుగా అన్ని కంపెనీలూ 2024లో స్పాన్సర్షిప్లను తగ్గించాయని యూనైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) డాటా ద్వారా వెల్లడైంది.
అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి అన్ని పెద్ద స్థాయి టెక్ కంపెనీలు ఈ ఏడాది హెచ్1బీ స్పాన్సర్షిప్లకు కోత పెట్టాయి. 2023లో 11 వేల వీసాలు స్పాన్సర్ చేసిన అమెజాన్ ఈ ఏడాది ఏడు వేలు మాత్రమే చేసింది. భారతీయ సంస్థలైన ఇన్ఫోసిస్, టీసీఎస్‌తో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, డెలాయిట్ సంస్థలు కూడా స్పాన్సర్షిప్లను తగ్గించాయి. మెటా సంస్థ మాత్రమే గత ఏడాది కంటే స్వల్పంగా, 400 స్పాన్సర్షిప్లను పెంచింది.
హెచ్1బీ వీసాల స్పాన్సర్‌షిప్‌లు తగ్గిపోవడం భారతీయులపైనే ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఈ వీసాలు పొందే వారిలో భారతీయులే అత్యధికం. 2023లో జారీ అయిన మొత్తం హెచ్1బీ వీసాల్లో మనోళ్లకే 72.3 శాతం దక్కడం బట్టి ఈ విషయం స్పష్టమవుతున్నది. చైనీయులకు 11.7 శాతం దక్కాయి. స్పాన్సర్‌షిప్‌లు తగ్గడం వల్ల హెచ్1బీ కోసం పోటీ భారీగా పెరిగిపోనుంది. కాగా, కృత్రిమ మేధ(ఏఐ) ప్రభావం పెరగడం, మాంద్యం వల్ల ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా టెక్ కంపెనీలు స్పాన్సర్షిప్లను తగ్గించాయని ఇమిగ్రేషన్ నిపుణుడు అజయ్ శర్మ అభిప్రాయపడ్డారు.