చండీఘడ్: డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్(Gurmeet Ram Rahim).. 15వ సారి పెరోల్ మీద రిలీజయ్యారు. ఇద్దరు మహిళా భక్తులను రేప్ చేసిన కేసులో అతను 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నారు. రోహతక్‌లోని సునరియా జైలు నుంచి అతను పెరోల్‌పై బయటకు వెళ్లారు. 40 రోజుల పాటు ఆయనకు పెరోల్ జారీ చేశారు. 2017లో దోషిగా తేలిన తర్వాత గుర్మీత్ పెరోల్‌పై రిలీజ్ కావడం ఇది 15వ సారి.
సిర్సాలో ఉన్న డేరా కార్యాలయంలో అతను 40 రోజుల పాటు ఉండనున్నారు. 16 ఏళ్ల క్రితం జర్నలిస్టు మర్డర్ కేసులోనూ గుర్మీత్ సింగ్‌ను 2019లో దోషిగా తేల్చారు. 2025 ఆగస్టులో కూడా 40 రోజుల పెరోల్‌పై గుర్మీత్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2025లోనూ అతనికి 21 రోజుల పెరోల్ ఇచ్చారు.
గుర్మీత్‌కు పెరోల్ ఇవ్వడాన్ని సిక్కు సంస్థలు వ్యతిరేకించాయి. పెరోల్‌పై రిలీజైన సందర్భాల్లో ఎక్కువ సార్లు ఉత్తరప్రదేశ్‌లోని భాగపత్ జిల్లాలోని డేరా ఆశ్రమంలో సింగ్ గడిపినట్లు సమాచారం.సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌదాకు భారీ సంఖ్యలో ఆయన అభిమానులు వస్తుంటారు. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గుర్మీత్‌కు పెను సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.