ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పోస్టర్లు కలకలం రేపాయి. ఆయన గన్స్ పట్టుకున్న ఫొటోలతోపాటు ‘బదులు తీర్చుకున్నాం’ అని అందులో ఉంది. (‘Badla Pura’ Posters) బద్లాపూర్‌లోని స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలపై టాయిలెట్లో స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడైన అక్షయ్ షిండే పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్లు వెలిశాయి. బుధవారం ముంబై, పరిసర ప్రాంతాల్లో ఇవి కనిపించాయి. ‘బద్లా పురా’ (ప్రతీకారం పూరైంది) అన్న అర్థం వచ్చేలా ఈ పోస్టర్లు ఉన్నాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బీజేపీ నేతలు ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు. బాధిత బాలికల స్కూల్‌కు చెందిన తుషార్ ఆప్టే ఈ బ్యానర్‌ను ఆయన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంబర్నాథ్ ప్రజా సంక్షేమ కమిటీకి బీజేపీ అధ్యక్షుడిగా అందులో పేర్కొన్నారు.
కాగా, బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసు నిందితుడు అక్షయ్ షిండే పోలీస్ కస్టడీలో మరణించడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. కిండర్ గార్టెన్ స్కూల్ నిర్వహిస్తున్న ట్రస్ట్ కార్యదర్శి, బీజేపీ నేత తుషార్ ఆప్టేను రక్షించడానికి అక్షయ్ షిండేను ప్రభుత్వం హత్య చేసిందని ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, ఆ వర్గం ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఆరోపించారు.
మరోవైపు చేతికి సంకెళ్లు వేసిన నిందితుడు కదులుతున్న వాహనంలో పోలీసు నుంచి పిస్టల్‌ను ఎలా లాక్కోగలిగాడని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘ఒక పోలీసుకు బుల్లెట్ గాయమైంది. మహారాష్ట్రలో పోలీసులు కూడా సురక్షితంగా లేరు. ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను బయటపెట్టాలి’ అని మీడియాతో అన్నారు.