అహ్మదాబాద్: గుజరాత్ కాంగ్రెస్ నేత, వడ్గామ్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని (Jignesh Mevani) అసోం పోలీసులు అరెస్టు చేశారు. ట్వీట్‌కు సంబంధించిన కేసులో పాలన్పూర్ సర్క్యూట్ హౌస్ వద్ద బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అహ్మదాబాద్ తరలించారు. అటునుంచి గురువారం ఉదయం గువాహటి తీసుకెళ్లారు. మేవానీని అరెస్టు చేసినట్లు అసోం పోలీసులు ట్వీట్ చేశారు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ట్వీట్ ఆధారంగా రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని కలిగించేందుకు యత్నించారని, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించారని కేసు నమోదుచేశారు. కాగా, ఈఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్‌ను అరెస్టు చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, ప్రముఖ దళిత నాయకుడు, రాష్ట్రీయ దళిత అధికార్ మంచ్ పార్టీ కన్వీనర్ అయిన జిగ్నేష్ మేవాని గత ఎన్నికల్లో వడ్గామ్ ఎన్నికల్లో గెలుపొందారు. అనంతరం 2021 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. మేవానీ అరెస్టు వార్తను తెలుసుకున్న గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ థాకూర్, ఆ పార్టీ కార్యకర్తలు అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద ధర్నాకు దిగారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.