అహ్మదాబాద్: ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఆరు గుర్తింపు పొందని రాజకీయ పార్టీల ఖాతాల్లో ఏకంగా రూ.1,700 కోట్ల నిధులు (2023-24లో) ఉండటం రాజకీయంగా సంచలనంగా మారింది. బీజేపీ మినహా మిగిలిన ఐదు జాతీయ పార్టీల (కాంగ్రెస్, ఆప్, బీఎస్సీ, సీపీఎం, ఎన్పీపీ) వద్ద ఉన్న మొత్తం నిధుల (రూ.1400 కోట్లు) కంటే ఈ పార్టీల వద్దే అధిక మొత్తం ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికల్లో ఐదు జాతీయ పార్టీల నుంచి 893 మంది అభ్యర్థులు పోటీ చేయగా, గుర్తింపు పొందని ఈ ఆరు పార్టీల నుంచి కేవలం 15 మంది అభ్యర్థులే బరిలో నిలిచారు. గుర్తింపు లేని ఈ ఆరు పార్టీల్లో నాలుగు గుజరాత్‌లోని నరోడా ప్రాంతానికి చెందినవి కావడం గమనార్హం. బీబీసీ న్యూస్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. భారత ఎన్నికల సంఘం వివరాల ప్రకారం ఈ ఆరు పార్టీలు.. ఆమ్ జన్మత్ పార్టీ, భారతీయ నేషనల్ జనతా దళ్, గరీబ్ కల్యాణ్ పార్టీ, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ, సత్యవాదీ రక్షక్ పార్టీ, ది స్వతంత్ర అభివ్యక్త్ పార్టీ అని తెలుస్తున్నది.
ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్.. బీజేపీ నేత!
2025 ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆరు పార్టీల సంపద ఏకంగా 223 శాతం పెరిగింది. 2019-24 మధ్య ఈ పార్టీల మొత్తం సంపద ఏకంగా రూ.2,316 కోట్లు. 2023-24లో ఆమ్ జన్మత్ పార్టీ అత్యధికంగా రూ.620 కోట్ల విరాళాలు పొందింది. కాంగ్రెస్ (రూ.281 కోట్లు) కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం ఒకే ఒక అభ్యర్థిని బరిలో నిలిపింది. ఆ పార్టీ ఫేస్బుక్ పేజీ వివరాల ప్రకారం అనామిక పాశ్వాన్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2020లో అనామిక పాశ్వాన్ అధ్యక్షురాలిగా ఈ పార్టీ ఏర్పాటైంది. కానీ అనామిక పాశ్వాన్ ప్రస్తుతం బీహార్ బీజేపీకి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉండటం గమనార్హం. అయి తే 2022లో తాను ఆమ్ జన్మత్ పార్టీకి రాజీనామా చేశానని అనామిక పేర్కొనడం గమనార్హం.
పార్టీ ఆఫీసులు మూత!
గుజరాత్‌లోని ఆనంద్ ప్రాంతానికి చెందిన సత్యవాదీ రక్షక్ పార్టీ విరాళాల రూపంలో రూ.330 కోట్లు పొందింది. ది స్వతంత్ర అభివ్యక్త్ పార్టీ 219 కోట్లు, న్యూ ఇండియా యునైటెడ్ పార్టీ 200 కోట్లు, భారతీయ నేషనల్ జనతా దళ్ 191 కోట్లు, గరీబ్ కల్యాణ్ పార్టీ 138 కోట్లు విరాళాలు పొందాయి. బీబీసీ నివేదిక ప్రకారం.. చాలావరకు ఈ పార్టీలు తమ కార్యాలయాలను మూసివేయగా, పార్టీల నేతలు మాట్లాడేందుకు నిరాకరించారు.
2025 ఏడీఆర్ నివేదిక ఆధారంగా ఈ రిపోర్ట్‌ను రూపొందించారు. దీని ప్రకారం 2,800 రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల్లో (ఆర్‌యూపీపీ-రిజిస్టర్ అయి గుర్తింపు పొందనివి) 73 శాతం పార్టీలు తమ ఆర్థిక వివరాలను వెల్లడించలేదు. అత్యధికంగా గుజరాత్లో ఇలాంటి పార్టీలు 744 ఉండగా, ఢిల్లీలో 240, తమిళనాడులో 230 ఉన్నాయి. ఇలాంటి రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీల్లో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది రెబల్ ఎంపీలు ఆ పార్టీలో చేరడమే ఇందుకు కారణం.
నల్లధనాన్ని మార్చేందుకే!
రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలకు పన్ను రాయితీలు ఉంటాయి. కాబట్టి నల్లధనాన్ని లాండరింగ్ చేసేందుకు ఈ ఆర్‌యూపీపీలను వినియోగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పార్టీలకు బీజేపీ మూలాలు ఉండటం అనుమానాలకు తావిస్తున్నది.