అహ్మదాబాద్ : కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల వరుసగా పార్టీ నుంచి నేతలు వీడుతున్నారు. పంజాబ్ ఎన్నికల ముందు మాజీ కేంద్రమంతి, సీనియర్ నేత పార్టీని వీడిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌కు చెందిన ఆ పార్టీ అధికార ప్రతినిధి జయరాజ్ సింగ్ పర్మార్ గురువారం రాజీనామా చేశారు. పార్టీ కొందరికి ‘వ్యక్తిగత ఆస్తి’గా మారిందని ఆరోపించారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు గుజరాత్లో జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. అయితే, ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానన్నారు.
పార్టీ రాష్ట్ర యూనిట్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వలేదని, అయితే తానెప్పుడూ ఫిర్యాదులు చేయలేదన్నారు. 2007, 2012, 2017 సాధారణ ఎన్నికలతో సహా 2019 ఉప ఎన్నికల్లో మెహసానాలోని ఖేరాలు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ కోరినా ఇవ్వలేదని, అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. 37 ఏళ్ల పాటు నిబద్ధతతో కూడిన కాంగ్రెస్ కార్యకర్తగా కొనసాగానని, గుజరాత్లో పార్టీని సజీవంగా ఉంచేందుకు తన వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని త్యాగం చేశానని పర్మార్ చెప్పారు. ఇదిలా ఉండగా, గుజరాత్ బీజేపీ మీడియా టీమ్ సభ్యుడు కిషన్సిన్హ్ సోలంకీ గురువారం పర్మార్ ఇంట్లో ఆయనను కలిశారు. పర్మార్ అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకుంటే బీజేపీ స్వాగతిస్తామని సోలంకీ విలేకరులతో అన్నారు.