అహ్మదాబాద్: గుజరాత్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ( Vijay Rupani ) తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు తన రాజీనామా లేఖను సమర్పించారు. విజయ్ రూపానీ 2016, ఆగస్టు 7 నుంచి గుజరాత్ సీఎంగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు ఉండగా విజయ్ రూపానీ రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తుంటే.. బీజేపీ కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
విజయ్ రూపానీ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల ఒక సభలో ప్రసంగిస్తూ ఆయన కుప్పకూలిపోయారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, విజయ్ రూపానీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించి, కొత్త ముఖ్యమంత్రి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ఆలోచనగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.