న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ ఆస్థానా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఇవాళ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జైల్‌సింగ్ మార్గ్‌లోని ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పోలీస్ బలగాలు ఆయనకు గౌరవ వందనం సమర్పించాయి. గతంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేసిన రాకేశ్ ఆస్థానాను ఢిల్లీ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమిస్తున్నామని, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు ఇవాళ రాకేశ్ ఆస్థానా ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
కాగా, రాకేశ్ ఆస్థానాకు మరో ఏడాది పదవీ కాలం మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది జూలై 31న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఇప్పటివరకు ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం లేదా కేంద్రపాలిత ప్రాంత క్యాడర్‌కు చెందిన వారే ఢిల్లీ పోలీస్ కమిషనర్లు నియమితులవుతూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు గుజరాత్ క్యాడర్‌కు చెందిన రాకేశ్ ఆస్థానాను నియమించారు. ఇలా ఇతర రాష్ట్ర క్యాడర్లకు చెందిన వ్యక్తిని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా నియమించడం అత్యంత అరుదు.
IPS officer Rakesh Asthana takes charges as the new Police Commissioner of Delhi pic.twitter.com/mJ1LUVzsrF
— ANI (@ANI) July 28, 2021
కాగా, రాకేశ్ ఆస్థానా 1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మకు, రాకేశ్ ఆస్థానాకు మధ్య ఆరోపణల పర్వం కొనసాగింది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకున్నారు. కాగా, గత జూన్ చివరలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ పదవీవిరమణ పొందారు. దాంతో ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ్‌కు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రాకేశ్ ఆస్థానా పూర్తిస్థాయి ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా వచ్చారు.