అహ్మదాబాద్ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్ధానాలు దక్కకున్నా గణనీయంగా ఓట్లు సాధించిన ఆప్‌నకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. పార్టీ తరపున గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీకి తలనొప్పిలా మారింది. ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారనే వార్తలు పార్టీ వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి.
ఆప్ ఎమ్మెల్యే భూపట్ భయానీ కాషాయ పార్టీలో చేరతారనే వార్తల నేపధ్యంలో భయానీ కీలక ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. తాను బీజేపీలో చేరడం లేదని, ప్రజల అభిప్రాయం తెలుసుకుని వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని చెప్పారు. బీజేపీలో లాంఛనంగా చేరకుండా ఆ పార్టీకి బయట నుంచి మద్దతిస్తానని సంకేతాలు పంపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భయానీ విసవదర్ అసెంబ్లీ స్ధానం నుంచి ఆప్ టికెట్‌పై గెలుపొందారు.