న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ చీఫ్ గోపాల్ ఇతాలియను ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని సరితా విహార్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల అవమానకర వ్యాఖ్యలు చేసిన వీడియోకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఆప్ నేతకు సమన్లు జారీ చేసింది.
తనను జైలులో పెడతామని ఎన్సీడబ్ల్యూ చీఫ్ హెచ్చరిస్తోందని..పటేల్ వర్గీయులను జైళ్లలో నిర్బంధించడం కన్నా మోదీ ప్రభుత్వం ఇంకేం ఇస్తుందని ఆప్ నేత వ్యాఖ్యానించారు. పటేల్ వర్గాన్ని బీజేపీ ద్వేషిస్తోందని, తాను సర్ధార్ పటేల్ సంతతికి చెందిన వాడినని, జైళ్లకు భయపడనని అన్నారు. తనను జైల్లో పెట్టాలని గోపాల్ ఇతాలియ ట్వీట్ చేశారు.
గోపాల్ ఇతాలియకు మహిళా కమిషన్ సమన్లు జారీ చేసిన క్రమంలో తమ కార్యాలయం వెలుపల గొడవ జరుగుతోందని ఎన్సీడబ్ల్యూ చీఫ్ రేఖా శర్మ ట్వీట్ చేసిన అనంతరం ఆయనను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు.