Gujarat : గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించిన దాదాపు 40 మంది ఎమ్మేల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని డెమోక్రాటిక్ రైట్స్ అసోసియేషన్ (ఏడీఆర్) తెలిపింది. బీజేపీ తరఫున గెలిచిన 156 మందిలో 26 మంది ఎమ్యేల్యేలకు నేర చరిత్ర ఉన్నట్టు ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. 40 మందిలో 29 మంది ఎమ్మేల్యేలు హత్నాప్రయత్నం, అత్యాచారానికి పాల్పడడం వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. వీళ్లలో 20 మంది బీజేపీకి చెందిన వాళ్లేనని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన నలుగురు ఎమ్మేల్యేలు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇద్దరు. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు, సమాజ్వాదీ పార్టీ ఎమ్మేల్యే ఒకరి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని డెమోక్రాటిక్ రైట్స్ అసోసియేషన్ తెలిపింది. అయితే 2017తో పోల్చితే క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మేల్యేల సంఖ్య తగ్గిందని ఈ సంస్థ తెలిపింది. ఆ ఏడాది దాదాపు 47 మంది నేరచరిత ఉన్నవాళ్లు ఎమ్మేల్యేలుగా ఎన్నికయ్యారు.
రెండు దఫాలుగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించింది. 182 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీ 157 స్థానాల్లో గెలిచి వరుసగా ఏడోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. కాంగ్రెస్ 17 అసెంబ్లీ సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. కేజ్రివాల్ నాయకత్వంలోని ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించి, జాతీయ పార్టీ హోదా అందుకుంది.