Gujarat | 2018 సంచలనం సృష్టించిన బిట్‌కాయిన్ స్కామ్, కిడ్నాస్ కేసులో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టులోని ఏసీబీ ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే నళిన్ కోటడియా, అమ్రేలి మాజీ ఎస్పీ, ఐపీఎస్ అధికారి జగదీశ్ పటేల్ సహా 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును ఇచ్చింది. రాష్ట్ర రాజకీయ, పోలీస్ వ్యవస్థను కుదిపేసిన ఈ కుంభకోణంలో సూరత్ బిల్డర్ శైలేష్ భట్ కిడ్నాప్, 200 బిట్కాయిన్లను స్వాధీనం చేసుకోవడం, విడుదల చేసేందుకు రూ.32 కోట్ల డిమాండ్ చేశారు. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పటి ఎస్పీ జగదీశ్ పటేల్ నేతృత్వంలోని అమ్రేలి పోలీసు అధికారులు.. రాజకీయ ప్రముఖులు, మధ్యవర్తులతో కలిసి గాంధీనగర్ నుంచి బిల్డర్ శైలేష్ భట్‌ను కిడ్నాప్ చేసి ఓ ఫామ్‌హౌస్‌లో బందీగా ఉంచారు.
రాష్ట్రం తరఫున కేసును వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ పటేల్ మాట్లాడుతూ.. ‘ఇది కేవలం స్కామ్ కాదు.. రాజకీయాలు, పోలీసులు.. అవినీతికి సంబంధించిన సంబంధం’గా పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నళిన్, జగదీశ్ పటేల్‌తోపాటు అరెస్టయిన 15 మందిలో అప్పటి అమ్రేలి ఎల్సీబీ పోలీస్ ఇన్స్పెక్టర్ అనంత్ పటేల్, సీబీఐ ఇన్స్పెక్టర్ సునీల్ నాయర్, న్యాయవాది కేతన్ పటేల్, వ్యాపారవేత్త కిరిత్ పలాడియా ఉన్నారు. జతిన్ పటేల్ అనే ఒక నిందితుడిని మాత్రమే కోర్టు నిర్దోషిగా విడుదల చేయగా.. మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పు చట్టానికి ఎవరూ అతీతులు కారని నిరూపిస్తోందని.. యూనిఫాంలో ఉన్నవారు, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు కూడా వ్యవస్థీకృత నేరాల్లో పాల్గొని అధికారాన్ని దుర్వినియోగం చేయలేరని సీనియర్ సీఐడీ క్రైమ్ అధికారి ఒకరు పేర్కొన్నారు.