న్యూఢిల్లీ: స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా రెండో నెల రూ.2 లక్షల కోట్లు దాటాయి. ఏప్రిల్లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.2.37 లక్షల కోట్లు కాగా, మే నెలలో రూ.2,01,050 కోట్లు. నిరుడు మే నెలలో ఈ వసూళ్లు రూ.1,72,739 కోట్లు. ఈ ఏడాది మే నెలలో దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన గ్రాస్ రెవిన్యూస్ 13.7 శాతం పెరిగి, రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి.
దిగుమతుల నుంచి జీఎస్టీ రెవిన్యూ 25.2 శాతం పెరిగి, రూ.51,266 కోట్లకు చేరింది. డెలాయిట్ ఇండియా పార్టనర్ ఎంఎస్ మణి మాట్లాడుతూ, రాష్ర్టాల నుంచి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో అంతరాలపై క్షుణ్ణంగా విశ్లేషణ జరగాలన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద రాష్ర్టాల్లో ఈ పెరుగుదల 17-25 శాతం కాగా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ర్టాల్లో 6 శాతం వరకు మాత్రమే పెరుగుదల కనిపించిందన్నారు.