హైదరాబాద్, నవంబర్ 19 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన అత్యాధునిక సమాచార ఉపగ్రహం జీశాట్-20 (జీశాట్-ఎన్2) మంగళవారం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రైవేటు అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ 34 నిమిషాల అనంతరం ఈ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్ కెనావెరాల్ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అనంతరం హసన్‌లో ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఈ ఉపగ్రహాన్ని నియంత్రణలోకి తీసుకొన్నది.
దేశంలో ఇంటర్నెట్ బ్రాండ్‌బ్యాండ్ సేవలను విస్తృతం చేయడానికి ప్రధానంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. మారుమూల ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. ఈ ఉపగ్రహం సాయంతో విమాన ప్రయాణ సమయంలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, వైఫై కనెక్టివిటీని మరింతగా మెరుగుపర్చే అవకాశం లభించనున్నది. జీశాట్ ఉపగ్రహం 14 ఏండ్ల పాటు సేవలు అందించనుంది.
వాణిజ్యపరంగా ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. అయితే, ఈ ప్రయోగాన్ని ఇస్రో పూర్తిగా చేపట్టకుండా స్పేస్ఎక్స్తో జట్టు కట్టడంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దీనిపై ఇస్రో మాజీ ఛైర్మన్ కే శివన్ స్పందించారు. ‘ఇస్రో ప్రయోగ వాహనాల సామర్థ్యాన్ని మించి జీశాట్ ఉపగ్రహం బరువు ఉంది. అందుకే దీన్ని ఇస్రో ద్వారా కాకుండా స్పేస్ఎక్స్ ద్వారా ప్రయోగించారు. ఇస్రోలో ఉన్న రాకెట్లు 4వేల కిలోల బరువున్న ఉపగ్రహన్ని మోసుకెళ్లగలవు. కానీ జీశాట్ బరువు 4700 కిలోలు. అందుకే స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌ను వాడుకొన్నాం’ అని ఆయన తెలిపారు.