న్యూఢిల్లీ, జూలై 14: దేశంలో పెండ్లికాని యువత పెరిగిపోతున్నట్టు ఓ ప్రభుత్వ సర్వే వెల్లడించింది. జాతీయ యువజన విధానం-2014 ప్రకారం 15-29 ఏండ్ల మధ్య వారిని యువతగా పరిగణిస్తారు. వీరిలో పెండ్లి కానివారు 2011లో 17.2% మంది ఉండగా, 2019 నాటికి వీరి సంఖ్య 23 శాతానికి పెరిగింది. పెండ్లికాని ప్రసాదుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాతీయ గణాంకాల కార్యాలయం నివేదిక పేర్కొంది. 2011 నాటికి పెండ్లికాని పురుషుల సంఖ్య 20.8% ఉండగా, 2019 నాటికి 26.1 శాతానికి పెరిగింది. యువతుల సంఖ్య కూడా 2011లో 13.5% నుంచి 2019 నాటికి 19.9 శాతానికి చేరింది. జమ్ముకశ్మీర్, యూపీ, ఢిల్లీ, పంజాబ్‌ల్లో పెండ్లికాని యువత సంఖ్య ఎక్కువగా ఉండగా, కేరళ, తమిళనాడు, ఏపీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో తక్కువగా ఉన్నది.
తగ్గిన బాల్య వివాహాలు
బాల్యవివాహాలు 2019-21 నాటికి 1.7 శాతానికి తగ్గాయి. యువతులు విద్యావంతులు అవుతున్నకొద్దీ పెండ్లి చేసుకొనే వయస్సు కూడా పెరుగుతున్నదని సర్వే పేర్కొంది. 18 ఏండ్లు దాటకముందే వివాహమయ్యే యువతుల సంఖ్య 15 ఏండ్లలో సగానికి సగం తగ్గినట్టు తెలిపింది. కౌమార దశలోనే తల్లులయ్యే వారి సంఖ్య 16 నుంచి 7శాతానికి తగ్గినట్టు పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణత, ఆయుర్దాయం పెరుగుదలతో 2036 నాటికి దేశంలో యువత జనాభా తగ్గిపోతుందని, వృద్ధుల సంఖ్య పెరుగుతుందని తెలిపింది. యువతీయువకుల సంఖ్య 1991లో 22.27 కోట్లు కాగా, 2021 నాటికి 37.14 కోట్లకు పెరిగింది. అయితే 2036 నాటికి వీరి సంఖ్య 34.55 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది.