లక్నో: పెళ్లి కోసం ఊరేగింపుగా బయలుదేరిన వరుడు మార్గమధ్యలో ఒక చోట ఆగాడు. అక్కడి సెంటర్లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యాడు. (groom’s Baarat Stop At Exam Centre) దీంతో అతడి అంకితభావం పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఆ వరుడ్ని వారంతా ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రశాంత్ యాదవ్ వివాహం ఆదివారం సాయంత్రం జరుగనున్నది. దీంతో తన బంధువులతో కలిసి ముధారి నుంచి బండాకు ఊరేగింపుగా బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలోని మహోబా వద్ద కానిస్టేబుల్ పరీక్షా కేంద్రం ఉంది. దీంతో తలపాగాతో పెళ్లి దుస్తుల్లో ఉన్న ప్రశాంత్ ఆ పరీక్షా కేంద్రం వద్ద పెళ్లి ఊరేగింపును ఆపాడు. లోనికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కానిస్టేబుల్ నియామకం కోసం నిర్వహించిన పరీక్షకు హాజరయ్యాడు.
కాగా, వరుడు ప్రశాంత్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఆ పరీక్షా కేంద్రం వద్ద ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది ఆశ్చర్యపోయారు. పోలీస్ కావాలన్న అతడి అంకితభావం, లక్ష్యం పట్ల చిత్తశుద్ధికి ముగ్ధులయ్యారు. వరుడి గెటప్‌లో ఉన్న ప్రశాంత్‌ను ప్రశంసించిన కొందరు పోలీస్ అధికారులు అతడితో ఫొటోలు దిగారు.
మరోవైపు దేశానికి సేవ చేయాలన్నది తన లక్ష్యమని వరుడు ప్రశాంత్ తెలిపాడు. అలాగే జీవిత ఆశయాలను సాధించే అవకాశాల విషయంలో ఎప్పుడూ రాజీ పడవద్దని సూచించాడు. వేడుకల కంటే జీవితంలో స్థిరపడేందుకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నాడు. అందుకే సాయంత్రం తన పెళ్లి జరుగాల్సి ఉండగా మార్గ మధ్యలో ఉన్న పరీక్షా కేంద్రానికి హాజరై కానిస్టేబుల్ పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.