అమరావతి, నవంబర్ 12: పెండ్లి వేదికపై వరుడిని కత్తితో పొడిచి పరారవుతున్న నిందితులను డ్రోన్ వెంటాడిన ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటుచేసుకుంది. నిందితుడిని రఘో జితేంద్ర భక్షీగా గుర్తించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు బడ్నేరా రోడ్‌లోని సాహిల్ లాన్లో 22 ఏండ్ల సుజల్ రామ్ సముద్ర వివాహం జరిగింది. స్టేజిపై ఉన్న పెండ్లి కొడుకును సమీపించిన భక్షీ అతడిని కత్తితో మూడు సార్లు పొడిచాడు. పెండ్లి కుమారుడి తండ్రిని కూడా పొడవడానికి ప్రయత్నించాడు. తర్వాత తన సహచరుడితో కలిసి బైక్‌పై పారిపోయాడు.
అయితే పెండ్లి వేడుకను చిత్రీకరించడానికి ఏర్పాటుచేసిన డ్రోన్‌ను నిందితుల వైపు డ్రోన్ ఆపరేటర్ తిప్పడంతో అది వారిని వెంబడించింది. అలా నిందితులను డ్రోన్ ద్వారా రెండు కి.మీ వెంబడించారు. డ్రోన్ ఆపరేటర్ చాకచక్యం ఈ కేసుకు కీలక ఆధారంగా ఉపయోగపడిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ చౌహాన్ తెలిపారు. కాగా, డీజే ప్రదర్శన సందర్భంగా జరిగిన చిన్న తోపులాటే ఈ హత్యాయత్నానికి కారణం. డాన్స్ చేస్తుండగా పెండ్లి కొడుకు.. నిందితుడిని కొద్దిగా పక్కకు తోశాడని, దీంతో వాగ్వాదం జరిగిందని, తర్వాత అతడు కక్షతో ఈ పనిచేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన పెండ్లి కొడుకు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు.