లక్నో: విందు ఆలస్యమైనందుకు వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. పెళ్లి రద్దు చేసుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు. (groom abandons wedding) అనంతరం మరో అమ్మాయిని ఆ వరుడు వివాహం చేసుకున్నాడు. ఇది తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని చందౌలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డిసెంబర్ 22న తన కుటుంబం, బంధువులతో కలిసి వరుడు మెహతాబ్ పెళ్లి ఊరేగింపుగా హమీద్పూర్ గ్రామానికి చేరుకున్నాడు. అయితే పెళ్లి భోజనం జాప్యం, రోటీలు ఆలస్యంగా వడ్డించడంపై వరుడు, అతడి కుటుంబ సభ్యులు ఆగ్రహించారు. వారికి నచ్చజెప్పేందుకు వధువు కుటుంబం ప్రయత్నించినప్పటికీ వినిపించుకోలేదు. పెళ్లి మధ్యలోనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
కాగా, అదృశ్యమైన వరుడు మెహతాబ్ ఆ రాత్రి బంధువైన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి వధువు కుటుంబం ఆగ్రహించింది. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో డిసెంబర్ 24న జిల్లా ఎస్పీని కలిశారు. పెళ్లి కోసం ఏడు లక్షలు ఖర్చు చేశామని, వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు ఆరోపించారు. పెళ్లిని మధ్యలో వదిలేసి మరో మహిళను పెళ్లాడిన వరుడు మెహతాబ్, అతడి కుటుంబంపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు.