Cockroach Janata Party : సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చుట్టూ అనేక వివాదాలు నడుస్తున్నాయి. పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఈ పార్టీ ఎక్స్ ఖాతాను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పార్టీకి చెందిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిషేధించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. భద్రతా కారణాల రీత్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈ పార్టీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్‌కు ఫాలోవర్లు పెరుగుతున్నారు. ఇప్పటికే 20 మిలియన్ల మందికి పైగా కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు ఉన్న పార్టీ అకౌంట్‌గా నిలిచింది. దీనికి ముందు అతిపెద్ద పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ అకౌంట్లను ఇది దాటేసింది. అయితే, ఈ ఫాలోవర్ల విషయంలో కూడా వివాదం నడుస్తోంది. వీరిలో అత్యధిక మంది ఫాలోవర్లు పాకిస్తాన్ నుంచే ఉండటం విశేషం. ఈ విషయాన్ని బీజేపీవైఎం ఆధారాలతో సహా బయటపెట్టింది. దీంతో వారు కాక్రోచ్ జనతా పార్టీని పాకిస్తాన్ జనతా పార్టీ (పీజేపీ)గా పిలుస్తున్నారు.
అలాగే అమెరికా నుంచి 14 శాతం మంది, బంగ్లాదేశ్ నుంచి మరో 14 శాతం మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఇదంతా ఫేక్ ప్రచారమని సీజేపీ ఫౌండర్ అభిజీతత్ ఆరోపిస్తున్నారు. తన ఫాలోవర్లకు సంబంధించిన ఒరిజినల్ డాటాను అతడు పంచుకున్నాడు. అందులో ఇండియా నుంచే 94.7 శాతం మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ డాటాకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా సంస్థలైన మెటా, ఎక్స్.. అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కేను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయి. తనను చంపేస్తామంటూ వాట్సాప్‌లో వార్నింగ్‌లు వస్తున్నాయని అభిజీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా అతడు పోస్ట్ చేశాడు. అతడు ఈ అకౌంట్‌ను మూసేస్తే డబ్బులు వస్తాయని, లేదా బీజేపీలో చేరాలని సూచించారు. లేకుంటే అమెరికాలో చంపేస్తామని ఆ స్క్రీన్ షాట్లో కనిపిస్తోంది. అంతకుముందు అతడి తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కేలు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రాజకీయ వేదిక తన కొడుకును ఇబ్బందుల్లోకి నెట్టిందని, అతడిని అరెస్టు చేసే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. అభిజీత్ ఈ విషయంలో భయంతో సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదని, సోషల్ మీడియాలో ఎంతమంది ఫాలోవర్లు ఉన్నా అతడికి భయం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.