న్యూఢిల్లీ: కార్మికుల కనీస వేతనాలు పెరిగాయి. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్‌ను సవరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కార్మికుల రోజువారీ కనీస వేతనాన్ని రూ.1,035 వరకు పెంచింది. పనిచేస్తున్న ప్రాంతాన్ని బట్టి ఏ, బీ, సీలుగా వర్గీకరించింది. సవరించిన వేతనాల ప్రకారం ‘ఏ’ ప్రాంతంలో పనిచేసే నిర్మాణం, ఊడ్వడం, క్లీనింగ్, లోడింగ్, అన్లోడింగ్ రంగాలలో పనిచేసే నైపుణ్యం లేని (అన్‌స్కిల్డ్) కార్మికుల రోజువారీ కనీస వేతనం రూ.783 (నెలకు 20,358)గా నిర్ణయించారు.
పాక్షిక నైపుణ్య (సెమీ స్కిల్డ్) కార్మికుల రోజువారీ కనీస వేతనం రూ.868 (నెలకు 22,568), నైపుణ్య (స్కిల్డ్) కార్మికులు, క్లర్కులు, ఆయుధం ధరించని వాచ్, వార్డ్లకు రోజువారీ కనీస వేతనం రూ.954 (నెలకు 24,804), అత్యంత నైపుణ్యం (హై స్కిల్డ్) కార్మికులకు, ఆయుధం ధరించే వాచ్, వార్డ్లకు కనీస వేతనం రూ.1,035 (నెలకు 26,910)గా నిర్ణయించారు. ఈ పెరిగిన కనీస వేతనాల అమలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.