న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న నరేంద్రమోదీ సర్కారు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండటం రైతులపాలిట శాపంగా మారింది. ఏటా వెయ్యిల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇందుకు అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు సరిగా పండకపోవడం ఒక కారణమైతే.. పండిన పంటలకు ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించకపోవడం మరో కారణం. పై రెండు కారణాలవల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
NCRB నివేదిక
ఈ నేపథ్యంలో.. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా 2021 పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌కు బ్యూరో (NCRB) ఇటీవల వెల్లడించిన నివేదిక ఆందోళన కలిగిస్తున్నది. ఆ నివేదిక ప్రకారం.. 2021లో దేశంలో రోజుకు 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలు కూడా రోజుకు 15 మంది చొప్పున బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
మొత్తం ఆత్మహత్యల్లో 6.6 శాతం రైతులే
వ్యవసాయ రంగానికి సంబంధించి గత ఏడాది మొత్తం 10,881 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. వారిలో 5,318 మంది రైతులు, 5,563 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. దేశంలో చోటుచేసుకున్న మొత్తం ఆత్మహత్యల్లో రైతు ఆత్మహత్యలు 6.6 శాతం. ఎందుకంటే 2021లో దేశంలో మొత్తం 1,64,033 మంది ఆత్మహత్య చేసుకోగా.. వారిలో 10,881 మంది రైతులే. ఇక ఆత్మహత్య చేసుకున్న 5,318 మంది రైతుల్లో 211 మంది మహిళలు, 512 మంది కౌలు రైతులు ఉన్నారు.
2017 నుంచి పెరిగిన రైతు ఆత్మహత్యలు
రైతుల ఆత్మహత్యలు 2017 నుంచి మరింత పెరిగాయి. 2017 నుంచి 2021 వరకు నాలుగేండ్ల వ్యవధిలో వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 53,000 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 28,600 మంది రైతులే ఉన్నారు. ఇక వ్యవసాయ రంగంలోని వారి ఆత్మహత్యల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్‌లో ఉంది. అక్కడ వ్యవసాయ రంగంలో 4,064 ఆత్మహత్యలు చోటుచేసుకోగా అందులో 2,640 మంది రైతులున్నారు. ఆ 2,640 మందిలో 211 మంది కౌలు రైతులు. మహారాష్ట్ర తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి.