జైపూర్: నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలకు పంపిణీ కోసం 1,500 స్కూటర్లు కొనుగోలు చేశారు. అయితే ఏడాదిపైగా వాటిని పంపిణీ చేయలేదు. దీంతో రెండు ప్రభుత్వ కాలేజీల వద్ద ఉంచిన రూ.12 కోట్ల విలువైన ఆ స్కూటర్లు స్క్రాప్‌గా మారుతున్నాయి. రాజస్థాన్‌లోని బాన్స్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన బాలికలు ఇంటర్ విద్యను కొనసాగించేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం ‘కాళీ బాయి భీల్ స్కూటీ పథకాన్ని 2020లో ప్రారంభించింది. రూ.80,000 చొప్పున 3000 స్కూటీలు కొనుగోలు చేసింది. వీటిలో 1500 స్కూటీలను బాలికలకు పంపిణీ చేశారు. మరో 1500 స్కూటీలను పంపిణీ చేయలేదు. బాన్స్వారాలోని విద్యామందిర్ ప్రభుత్వ కాలేజీ, హర్దేవ్ జోషి ప్రభుత్వ బాలికల కాలేజీ గ్రౌండ్లో వీటిని ఉంచారు.
కాగా, 2023లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల వల్ల 1500 స్కూటీలను ఏడాదిగా బాలికలకు పంపిణీ చేయలేదు. దీంతో రెండు ప్రభుత్వ కాలేజీల గ్రౌండ్స్‌లో ఉంచిన అవి తప్పుపట్టి స్క్రాప్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంపై ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మండిపడింది.
మరోవైపు రాజస్థాన్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాబు లాల్ ఖరాడి దీనిపై స్పందించారు. ఈ స్కూటర్లను వారంలోపు బాలికలకు పంపిణీ చేస్తామని తెలిపారు. అయితే ఏడాదిగా కాలేజీ గ్రౌండ్లో ఉంచిన ఈ స్కూటీలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సమాధానాన్ని ఆయన దాటవేశారు. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.