Rajastan Assembly | రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బీజేపీ సభ్యుల అరుపులు, కేకల మధ్య ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ను ప్రసంగించకుండా బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు. వీరికి ఆర్ఎల్పీ సభ్యులు కూడా తోడయ్యారు. వీరి అరుపులు ఎంతకూ ఆగకపోవడంతో గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించకుండానే సభను వీడి వెళ్లిపోయారు. ఆర్ఎల్పీ సభ్యుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్.. వారిని ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. గవర్నర్‌కు అవమానం జరుగుతున్నదంటూ గగ్గోలు పెట్టే బీజేపీ నేతలు.. రాజస్థాన్‌లో మాత్రం గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి అవమానించారు.
రాజస్థాన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వేడివేడిగా మొదలయ్యాయి. గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రసంగం ప్రారంభించగానే ప్రతిపక్ష నేత గులాబ్‌చంద్ కటారియా లేచి నిల్చుని పేపర్ లీక్‌పై విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు. దాంతో ఒక్కసారిగా బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హంగామా సృష్టించారు. వీరికి ఆర్ఎల్పీ సభ్యులు కూడా తోడవడంతో గవర్నర్ ప్రసంగానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా తన ప్రసంగాన్ని అర్ధాంతరంగాముగించి సభ నుంచి నిష్క్రమించారు.
సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా గందరగోళం కొనసాగింది. బీజేపీ, ఆర్ఎల్పీ సభ్యుల ఆందోళన సద్దుమణగకపోవడంతో స్పీకర్ డాక్టర్ సీపీ జోషి సభను అదుపులో పెట్టేందుకు సహకరించాలని కోరారు. బీజేపీ సభ్యులు తమతమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోగా.. ఆర్ఎల్పీకి చెందిన ముగ్గురు సభ్యులు మాత్రం వెల్‌లోనే కూర్చుండిపోయారు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ఆర్ఎల్పీ ఎమ్మెల్యేలు పుఖ్రాజ్ గార్గ్, నారాయణ్ బెనివాల్, బావ్రీ ప్లకార్డులతో డిమాండ్ చేశారు. దాంతో వారిని ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. కాగా, గతేడాది బడ్జెట్ సెషన్లో కూడా పేపర్ లీక్ అంశం చర్చనీయాంశం కాగా, ఈసారి కూడా పేపర్ లీక్ అంశం ప్రధానమైంది. ఇలాఉండగా, ఫిబ్రవరి 8 న బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.