బెంగుళూరు: కర్నాటక అసెంబ్లీ(Karnataka Assembly)లో ఇవాళ గందరగోళం నెలకొన్నది. గవర్నర్ థావర్చాంద్ గెహ్లాట్ కేవలం రెండు లైన్ల ప్రసంగాన్ని మాత్రమే చదివి వినిపించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనపై విమర్శలు చేసింది. కేవలం ప్రారంభ పంక్తులు మాత్రమే చదవి గెహ్లాట్ తన ప్రసంగాన్ని ముగించేశారు. ఆర్థికంగా, సామాజిక అభివృద్ధి పరిచేందుకు తన రాష్ట్రం కట్టుబడి ఉందని, జై హింద్.. జై కర్నాటక అని ఆయన హిందీలో ప్రసంగాన్ని చదివి వినిపించారు. గవర్నర్ థావర్చాంద్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించడంతో కాంగ్రెస్ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు.
షేమ్ షేమ్ అని కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. రాజ్యాంగాన్ని గవర్నర్ గెహ్లాట్ ఉల్లంఘించారని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ప్రభుత్వం రాసిచ్చిన పూర్తి ప్రసంగాన్ని ఆయన చదవలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మగా గవర్నర్ గెహ్లాట్ మారినట్లు పేర్కొన్నారు. గవర్నర్ ప్రవర్తన పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. కర్నాటక సర్కారు రూపొందించిన ప్రసంగంలోని 11 పేరాలపై గవర్నర్ థావర్చాంద్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు.