న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి విజయన్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై భౌతిక దాడికి కుట్ర పన్నారని, ముఖ్యమంత్రి ఆదేశానుసారమే సీపీఐ (ఎం) అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐకి చెందిన విద్యార్థులు తన కారుపై దాడి చేశారని అన్నారు. తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న గవర్నర్ కారుపై ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై ఆరిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నివేదిక సమర్పించాలని తను ఆదేశాలు ఇచ్చిన క్రమంలోనే ఈ దాడి యత్నం జరిగిందని ఆయన చెప్పారు. ‘నేను అడిగిన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని సీఎం అంటున్నారు. ప్రభుత్వం సంక్షోభంలో ఉంటే దానిపై తగు సిఫార్సులు చేయడం గవర్నర్‌గా నా విధి’ అంటూ ఆయన హెచ్చరించారు.