Union Cabinet |మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.19,919 కోట్ల విలువైన నాలుగు కీలక ప్రాజెక్టులకు కేంద్రమంత్రి వర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. ఇందులో ఎలక్ట్రికల్ వాహనాలు, రక్షణ రంగానికి కీలకంగా పరిగణించే రూ.7,280 కోట్ల అరుదైన రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్ సైతం ఉన్నది. పూణే మెట్రో పొడిగింపునకు రూ.9,858 కోట్లు, దేవభూమి ద్వారక (ఓఖా)-కనాలస్ రైల్వే లైన్ డబ్లింగ్ కోసం రూ.1,457 కోట్లు, బద్లాపూర్-కర్జాత్ మూడు, నాల్గో రైల్వే లైన్లకు రూ.1,324 కోట్లు కేటాయింస్తూ నిర్ణయించారు. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ మానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టుకు గతంలో అంచనా వేసిన రూ.2500 కోట్ల ప్యాకేజీ కంటే మూడు రెట్లు ఎక్కువ కేటాయించారు.
చైనా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రేర్ ఎర్త్ రా మెటీరియల్‌ను చైనా 60 నుంచి 70శాతం ప్రెసెసింగ్లో 90శాతం నియంత్రిస్తుంది. ఈ క్రమంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం తొలిసారిగా కొత్త ప్రాజెక్టును ఆమోదించింది. ఈ పథకం సింటెర్డ్ REPM ఉత్పత్తి కోసం ఇంటిగ్రేటెడ్ తయారీ సౌకర్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యం. ఇందులో రేర్ ఎర్త్ ఆక్సైడ్లను వెలికి తీసి చివరకు మ్యాగ్నెట్స్‌గా మారుస్తారు. అయితే, భారత్ ఈ రంగం ఇప్పటికీ పరిమిత నిధులు, సాంకేతిక నైపుణ్యం లేకపోవడం, సుదీర్ఘ ప్రాజెక్ట్ తదితర అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ మద్దతు లేకుండా వాణిజ్య ఉత్పత్తి ప్రస్తుతం సాధ్యం కాదు. మైనింగ్ కారణంగా జరిగే పర్యావరణ నష్టాలు ఈ రంగాన్ని మరింత క్లిష్ట తరం చేస్తాయి.
బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఉపయోగించడానికి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌ను ఎగుమతి చేసేందుకు చైనా ప్రాథమిక లైసెన్సులు జారీ చేసింది. కానీ, భారతీయ కంపెనీలకు ఇంకా లైసెన్సులు జారీ చేయలేదు. ఆక్సైడ్ కోసం భారతదేశ వార్షిక డిమాండ్ సుమారు 2వేల టన్నులు. అనేక ప్రపంచ సరఫరాదారులు కొరత తీర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. భవిష్యత్తులో రేర్ ఎర్త్ మూకాల విదేశీ దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించేందుకు సింక్రోనస్ రిలక్టెన్స్ మోటార్లపై అధ్యయనాలకు కేంద్రం నిధులు సమకూరుస్తోంది. ఏప్రిల్‌లో చైనా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేసిన తర్వాత భారత్ సరఫరా గొలుసు అభివృద్ధిని వేగవంతం చేసింది. చైనా-యూఎస్ మధ్య వాణిజ్య ఉద్రిక్తతల మధ్య.. చైనా ఈ 17 కీలక అంశాలను వ్యూహాత్మక ఆయుధంగా ఉపయోగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలైలో కీలకమైన ఖనిజాలను ఆయుధీకరించకూడదని.. స్థిరమైన, వైవిధ్యభరితమైన సరఫరా గొలుసులను నిర్ధారించాలని హెచ్చరించారు. భారత్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 2,270 టన్నుల అరుదైన భూమి లోహాలు, సమ్మేళనాలను దిగుమతి చేసుకుంది. ఇది మునుపటి సంవత్సరం కంటే దాదాపు 17శాతం ఎక్కువ. ఈ సరఫరాలలో 65 శాతం కంటే ఎక్కువ చైనా నుంచి దిగుమతి అయ్యాయి.