కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 81 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ 206 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. అయితే భబానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా తీర్పును చోరీ చేశారని ఆమె అన్నారు. అనైతిక రీతిలో తనను ఓడించినట్లు ఆమె చెప్పారు. అయితే కౌంటింగ్ సెంటర్లో తనపై దాడి జరిగినట్లు కూడా దీదీ పేర్కొన్నారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్‌కాల్‌లో ఆమె ఈ ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియోను ఎంపీ కళ్యాణ్ బెనర్జీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. కౌంటింగ్ వద్ద ప్రవర్తన సరిగా లేదని, తుది రౌండ్ల సమయంలో అక్రమాలు జరిగినట్లు మమతా బెనర్జీ తన ఫోన్ కాల్లో పేర్కొన్నారు. భబానీపూర్‌లో తుది రౌండ్ల కౌంటింగ్ మా ప్రాంతానివని, ఆ సమయంలో కొందరు గుండాలు కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించారని, నన్ను కొట్టారని, సీఆర్పీఎఫ్ సహాయంతో మా ఏజెంట్లను తోసేశారని మమతా బెనర్జీ ఆ ఫోన్‌కాల్‌లో ఆరోపించారు. కీలక సమయంలో కౌంటింగ్ హాల్లోకి తనను ఎంట్రీ కానివ్వలేదన్నారు.
భబానీపూర్‌లో కౌంటింగ్ ప్రక్రియ థ్రిల్లింగ్‌గా సాగింది. 20 రౌండ్ల కౌంటింగ్‌లో కొన్ని సమయాల్లో అటూ ఇటూ వెళ్లింది. ఆరంభంలో మమతా బెనర్జీ రెండు వేల ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఏడో రౌండ్ సమయానికి ఆమె 17 వేల ఓట్లు ఆధిక్యంలోకి వెళ్లారు. ఇక ఆ సమయంలో టీఎంసీ మద్దతుదారులు దాదాపు సంబరాలు చేసుకున్నారు. ఇక తర్వాత ఫలితాల్లో మార్పు మొదలైంది. 14వ రౌండ్ ముగిసే వరకు మమతా బెనర్జీ ఆధిక్యం నాలుగు వేలకు పడిపోయింది. కొన్ని రౌండ్ల తేడాలోనే నాటకీయంగా బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలోకి వెళ్లారు. ఆ తర్వాత ఆయన 15,105 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. దీంతో దీదీకి షాక్ ఇచ్చాడు సువేంధు.
16వ రౌండ్ వరకు తానే లీడింగ్‌లో ఉన్నట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. కానీ తమ పార్టీకి చెందిన కౌంటింగ్ ఏజెంట్లను తొలగించిన తర్వాత మార్పు మొదలైనట్లు ఆమె ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను సరైన సీలింగ్ లేకుండానే స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారని, తుది రౌండ్ల కౌంటింగ్ సమయంలో కౌంటింగ్ హాల్లో టీఎంసీ ప్రతినిధులు లేరని ఆమె పేర్కొన్నారు. చిత్రహింసకు గురిచేసినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్రం, బీజేపీ ఆదేశాల ప్రకారమే ఎన్నికల సంఘం, సీఆర్పీఎఫ్, స్థానిక ఎన్నికల అధికారులు వ్యవహరించినట్లు మమతా బెనర్జీ విమర్శించారు. ఓటర్ రోల్స్‌లోనూ అక్రమాలు జరిగినట్లు ఆరోపించారు. బలవంతంగా ఓట్లను చోరీ చేశారన్నారు. అన్ని ఆధారాలను డాక్యుమెంట్ చేశామని, వాటిని కోర్టులో సమర్పించనున్నట్లు తెలిపారు.ఇది బీజేపీ విజయం కాదు, అనైతిక గేమ్ అన్నారు.