Facebook | హైదరాబాద్, జపవరి 10 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ‘ఫేస్బుక్ అకౌంట్‌ను డిలీట్ చేయడం ఎలా?’, ‘ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న సోషల్మీడియాలేంటి?’ గత కొంతకాలంగా అమెరికన్ నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న విషయాలు ఇవే. ఫేస్బుక్, ఇన్‌స్టా, థ్రెడ్స్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు మాతృసంస్థ అయిన మెటా తాజాగా తీసుకొచ్చిన నిబంధనలే నెటిజన్ల ఆగ్రహానికి కారణమని ‘టెక్‌క్రంచ్’ ఓ నివేదికలో వెల్లడించింది.
మెటాకు చెందిన అన్ని సోషల్‌మీడియా వేదికల్లో ప్రసారమయ్యే కంటెంట్ పాలసీలను మారుస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు. తమ వేదికల్లో ప్రసారమయ్యే అసత్య వార్తలు, వీడియోలు సరైనవో కాదో చెక్ చేసే థర్డ్ పార్టీ ఫాక్ట్-చెకింగ్ సిస్టమ్‌కు ముగింపు పలుకుతున్నట్టు ఆయన తెలిపారు. అలాగే యూజర్లు చూసే వార్తల్లో ఇకపై రాజకీయ అంశాలకు పెద్దపీట వేయనున్నట్టు వెల్లడించారు.
మెటా తీసుకొన్న తాజా నిర్ణయం సోషల్‌మీడియాలో పారదర్శకత ఉండాలన్న స్ఫూర్తికి విరుద్ధమని పలువురు మండిపడుతున్నారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్‌కు బాకా ఊదేందుకే మార్క్ జుకర్‌బర్గ్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఇంకొందరు ఆరోపిస్తున్నారు. మెటా తాజా నిర్ణయంతో తప్పుడు సమాచారం, విద్వేషపూరిత కంటెంట్ పెచ్చరిల్లే ప్రమాదమున్నదని టెక్నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్బీకి ప్రత్యామ్నాయ వేదికలేంటి అంటూ బ్లూస్కై, మాస్టోడోన్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలను పలువురు సెర్చ్ చేసినట్టు తెలిపింది.
2021లో అమెరికాలోని క్యాపిటల్ హిల్ భవనంపై జరిగిన దాడికి ఫేస్బుక్లో ప్రచారమైన విద్వేషపూరిత సమాచారం ఒకరకంగా ఆజ్యంపోసిందని చెప్తారు. తప్పుడు సమాచార వ్యాప్తిని మెటా కట్టడి చేయలేదని విమర్శలూ ఉన్నాయి. మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన దాడులకు ఫేస్బుక్ ఒక ఉత్ప్రేరకంగా మారిందని విమర్శలున్నాయి.