Goods Train Overturn | బొగ్గు లోడ్‌తో వెళ్తున్న ఓ గూడ్స్ రైలు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో 57 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ఘటన గయా-ధన్‌బాద్ ఘాట్ సెక్షన్లో లోయ దిగుతుండగా సంభవించింది. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఒకే బోగీతో ఇంజిన్ దూసుకుపోగా.. గుర్పా స్టేషన్లో స్లిప్ సైడింగ్ చేసి ఆపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. పలు రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ మార్గంలో నడిచే 10 కి పైగా రైళ్లను దారి మళ్లించారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు హజారీబాగ్ టౌన్ నుంచి దాద్రిలోని ఎన్టీపీసీకి వెళ్తున్నట్లుగా తెలుస్తున్నది.
బుధవారం తెల్లవారు జామున గయా-ధన్‌బాద్ మార్గంలో లోయ దిగుతున్న గూడ్స్ రైలుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. దాంతో రైలు వేగం మరింత పెరిగింది. రైలుకున్న 57 బోగీలు బోల్తా కొట్టాయి. దాంతో ఇంజిన్ నుంచి బోగీలు వేరయ్యాయి. దాంతో 150 కిలో మీటర్ల వేగంతో ఒక బోగీతో ఇంజిన్ చాలా దూరం ప్రయాణించింది. గమనించిన రైల్వే సిబ్బంది గుర్పా స్టేషన్ వద్ద స్లిప్ సైడింగ్ చేసి నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు నిలిచిపోయాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రాణనష్టం జరుగలేదని రైల్వే అధికారులు చెప్పారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇందులో 58 కోచ్‌ల గూడ్స్ ట్రెయిన్ ఇంజిన్ ఒకే ఒక బోగీతో వేగంగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రమాదాన్ని నివారించడంలో భాగంగా స్టేషన్‌ను ఖాళీ చేయించారు. దాంతో స్వల్పంగా తొక్కిసలాట జరిగింది.