Vande Bharat Express | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. గత ఆరు సంవత్సరాల్లో దాదాపు అన్ని రాష్ట్రాలకు కేంద్రం వందే భారత్ రైళ్లను కేటాయించింది. అయితే, తాజాగా స్పీపర్ రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టనున్నది. ఈ రైళ్ల కోసం ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ప్రయాణికుల నిరీక్షణ ఫలించబోతున్నది. అదే సమయంలో చైర్‌కార్ వందే భారత్ రైళ్లను సైతం రైల్వేశాఖ మరికొన్ని మార్గాల్లో ప్రారంభించే అవకాశం ఉన్నది.
దాంతో పాటు ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరికొద్ది దూరం పాటు పొడగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఏప్రిల్ తొలివారంలో బెంగళూరు-బెల్గాం వరకు సెమీహైస్పీడ్ రైలు నడువనున్నది. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పొడిగించనున్నారు. బెల్గాం వరకు పొడిగించి నడపాలని విజ్ఞప్తుల మేరకు.. రైల్వేశాఖ ప్రణాళిక రూపొందించింది. దాంతో లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి.
ఏప్రిల్ నుంచి బెల్గాం-బెంగళూరు మధ్య వందే భారత్ నడపాలని భావిస్తున్నారు. బెంగళూరు నుంచి ధార్వాడ్ నుంచి బెల్గాం వరకు వందే భారత్‌ను నడపాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ జగదీష్ షెట్టార్ గత కొద్ది రోజుల కిందట కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ధార్వాడ్ నుంచి బెల్గాం మధ్య వందే భారత్ రైలు ట్రయల్ రన్ సైతం జరిగింది. దీని కోసం బెల్గాం స్టేషన్‌ను సైతం పునరుద్ధరిస్తున్నారు. బెల్గాం నుంచి బెంగళూరు మధ్య నడిచే వందే భారత్ రైలుకు 20661-20662 నంబర్ కేటాయించారు.
ఇటీవల, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న బెంగళూరు-ధార్వాడ్ వందే భారత్ రైలును బెల్గాం వరకు పొడిగించాలన్న అభ్యర్థనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని అన్నారు. కొద్ది రోజుల కిందట హుబ్లిలో రైల్వేల నైరుతి ప్రాంత జనరల్ మేనేజర్, ఇతర సీనియర్ అధికారులతో లాభనష్టాలపై చర్చించేందుకు సమావేశం జరిగిందని చెప్పారు. నిరంతర ప్రయత్నాల ఫలితంగా రైల్వేశాఖ మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. ప్రస్తుతం బెంగళూరు-ధర్వాడ్ మధ్య నడుస్తున్న రైలును బెల్గాం వరకు పొడిగించేందుకు సానుకూలంగా స్పందించారన్నారు.