న్యూఢిల్లీ, జనవరి 13: రానున్న ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ భారత్కు అత్యంత కీలకమని గోల్డ్మన్ శాచ్స్ నివేదిక అభిప్రాయపడింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్లో ప్రజా రుణాలు, ద్రవ్య లోటు అధికంగా ఉన్నందున సమతుల వృద్ధి, ఆర్థిక క్రమశిక్షణ కోసం ఈ బడ్జెట్ ముఖ్యమైనదని పేర్కొన్నది. రుణాలు – జీడీపీ నిష్పత్తులు పాటించేందుకు గానూ ద్రవ్య లోటును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఏకీకరణ విధానాన్ని కొనసాగించవచ్చని అభిప్రాయపడింది.
అయితే, ఈ కఠినమైన చర్య రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధికి ప్రతిబంధకంగా మారవచ్చని పేర్కొన్నది. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం జీడీపీలో 4.9 శాతంగా ఉన్న ద్రవ్య లోటును 4.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.