ఇటావా: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ఇటావాలో దారుణం జరిగింది. ఓ జ్వలరీ వ్యాపారి.. నలుగురు కుటుంబసభ్యులకు విషం ఇచ్చి చంపాడు. ముకేశ్ వర్మ అనే వ్యక్తి తన భార్యకు, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడికి విషం ఆహారం ఇచ్చాడు. నలుగుర్ని చంపిన తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోబోయాడు. అయితే అతన్ని ఆర్పీఎఫ్ సిబ్బంది రక్షించింది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే.. భార్య, కూతుళ్లను చంపిన జ్వల్లర్ ముకేశ్ కుమార్ .. వాళ్ల ఫోటోలను తన వాట్సాప్ స్టేటస్‌లో అప్లోడ్ చేశాడు. ఆ స్టేటస్‌ను ఇతర కుటుంబసభ్యులు వీక్షించారు. ఆ తర్వాత ఇంట్లోని రూముల్లో వాళ్ల మృతదేహాలను గుర్తించారు.
భార్య రేఖ, కుమార్తెలు భవ్య(22), కావ్య(17), అభిషిత్(12) శవాలు.. నాలుగు అంతస్థుల భవనంలోని ఓ రూమ్‌లో లభించాయి. ఆ బిల్డింగ్‌లోనే తన సోదరులతో కలిసి జ్వలర్ ముకేశ్ కుటుంబం నివసిస్తోంది. కుటుంబసభ్యులతో తగాదా రావడం వల్లే ముకేశ్ వర్మ తన భార్య, పిల్లలను హతమార్చినట్లు తెలుస్తోంది. కుటుంబాన్ని చంపిన తర్వాత రైల్వే స్టేషన్ వద్ద మరుదార్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశాడతను. ముకేశ్‌కు స్వల్ప గాయాలైనట్లు పోలీసులు చెప్పారు. కుటుంబసభ్యుల మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు పంపినట్లు తెలిపారు.
సోమవారం రాత్రి పది గంటల సమయంలో విషపూరిత పదార్ధాన్ని భార్యా, పిల్లలకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ బృందాలతో కలిసి ఎస్పీ అభయనాథ్ త్రిపాఠి దర్యాప్తు నిర్వహించారు. ఢిల్లీలో ముకేశ్ గోల్డ్ ట్రేడింగ్ చేస్తుంటాడు. దీంతో అతను ప్రతి వారానికి ఒకసారి ఢిల్లీ వెళ్లి వస్తుంటాడు. అతని పెద్ద కూతురు భవ్య కూడా ఢిల్లీలో చదువుతోంది. ఆమె దివాళీ కోసం ఇంటికి వచ్చింది. కావ్య మాత్రం 12వ గ్రేడ్ చదువుతోంది. పెద్ద కూతురు భవ్య మొదటి భార్యకు జన్మించింది. ఆమె పెళ్లి అయిన రెండేళ్లకు మరణించింది. ఆ తర్వాత రెండవ భార్యతో ఇద్దరు పిల్లలను కన్నాడతను.