జైపూర్: ఒకప్పుడు స్వర్ణమయంగా ఉండే భారతదేశం.. విదేశీయుల దాడితో బంగారం మొత్తం మాయమైందని చరిత్రకారులు చెప్తుంటారు. భారతదేశం మట్టిలో దాగి ఉన్న బంగారంపై వారి కన్ను పడకపోవడంతో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బంగారాన్ని వెలికితీసే పనులను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్నాయి. తాజాగా, రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా పరిధిలోని కోట్లి ప్రాంతంలో బంగారు గనిని గుర్తించారు.
బంగారు గనుల అన్వేషణ పనులను చేపట్టిన మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్.. 2008 లో కోట్లి ప్రాంతంలో సర్వే చేపట్టింది. ఇప్పుడు ఆ మట్టిలో పెద్ద ఎత్తున బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయని నివేదిక అందింది. భూమికి 60 నుంచి 160 మీటర్ల దిగువన ఈ నిధి దాగి ఉన్నట్లుగా అంచనా వేశారు. ఈ గనిలో 600 కిలోల బంగారం, 250 టన్నుల రాగి నిల్వలు ఉన్నట్లుగా నివేదికలో పేర్కొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ ఈ గని కోసం టెండర్‌ను జారీ చేసింది. బ్లాక్ ధర రూ. 1,840 కోట్లుగా నిర్ణయించారు. టెండర్ బిడ్లు రూ.128 కోట్ల నుంచి ప్రారంభం కానున్నాయి.
రాజస్థాన్ భిల్వారా జిల్లాలో ఆసియాలోనే రెండు అతిపెద్ద గనులు ఉన్నాయి. ప్రపంచంలోని, ఆసియాలో రెండవ అతిపెద్ద జింక్ గని కూడా ఇదే జిల్లాలోని అగు ప్రాంతంలో ఉన్నది. కోట్లి ప్రాంతంలోని గనిలో నుంచి బంగారం తీయడం పూర్తయితే ఆర్థికంగా మన దేశం పుంజుకునే అకాశాలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.