Golconda Blue Diamond | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: స్వాతంత్య్రానికి పూర్వం ఇండోర్, బరోడా మహరాజుల చెంత ఉన్న గోల్కొండ నీలి వజ్రం మొట్టమొదటిసారి వేలానికి వస్తోంది. గోల్కోండ గనుల్లో లభించిన అత్యంత అరుదైన వజ్రంగా పరిగణించే ఈ వజ్రం మే 14న జెనీవాలోని క్రిస్టీస్ మెగ్నిఫిషెంట్ జువెల్స్లో మొదటిసారి వేలానికి రానున్నది. 23-24 క్యారెట్ల బరువైన నీలి వజ్రం పొదిగిన బంగారు ఉంగరం వేలంలో రూ. 300 కోట్ల నుంచి రూ.430 కోట్ల వరకు ధర పలకవచ్చని అంచనా.
అత్యంత అరుదైన ఇటువంటి వజ్రం జీవితంలో ఎప్పుడోకాని వేలానికి రాదని, 259 సంవత్సరాల క్రిస్టీస్ చరిత్రలో ప్రపంచంలోని అత్యంత విలువైన గోల్కోండ వజ్రాలను వేలం వేసే అదృష్టం తమకు లభించిందని క్రిస్టీ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెలరీ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత తెలంగాణలో గోల్కొండ గనులలో లభించిన ఈ నీలి వజ్రం 1920-1930 దశకాలలో ఇండోర్ మహరాజుగా ఉన్న యశ్వంత్ రావు హోల్కర్ వద్దకు చేరింది. 1923లో మహరాజు తండ్రి ఓ ఫ్రెంచ్ వ్యాపారి నుంచి బ్రేస్లెట్లో పొదిగిన ఈ నీలి వజ్రాన్ని కొనుగోలు చేశారు. అనంతరం 1947లో దీన్ని న్యూయార్క్ జువెలర్ హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశారు. అక్కడి నుంచి అది మళ్లీ బరోడా మహరాజు వద్దకు చేరింది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిన గోల్కొండ నీలి వజ్రం మళ్లీ ఇన్నాళ్లకు వేలానికి వస్తోంది.