Maha minister : చిరుతలు (Leopards) జనావాసాల్లో ప్రవేశించి మనుషులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మహారాష్ట్ర అసెంబ్లీ (Maharastra Assembly) లో ఎన్సీపీ ఎమ్మెల్యే (NCP MLA) జితేంద్ర అవ్హాద్ (Jitendra Awhad) ఈ అంశాన్ని ప్రస్తావించారు. మనుషులపై చిరుతల దాడులు పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఈ దాడుల కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదని ప్రశ్నించారు. అందుకు అటవీ శాఖ మంత్రి (Forest Minister) గణేశ్ నాయక్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది.
చిరుతలు జనావాసాల్లోకి వచ్చి జనాలపై దాడులు చేయకుండా ఉండాలంటే.. అడవుల్లోకి మేకలను వదిలిపెట్టాలని ఆయన సమాధానమిచ్చారు. చనిపోయిన తర్వాత బాధితులకు పరిహారం అందించే బదులు.. అదే డబ్బుతో మేకలను కొనుగోలు చేసి అడవిలోకి వదిలివేయాలన్నారు. ఈ మేరకు అటవీ అధికారులకు ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలిపారు. చిరుత దాడిలో వ్యక్తి మరణిస్తే ప్రభుత్వం వారికి రూ.25 లక్షలు పరిహారంగా ఇస్తున్నదని, మేకలను అడవుల్లోకి వదిలితే అదే పరిహారంతో మనుషుల ప్రాణాలు కాపాడవచ్చని అభిప్రాయపడ్డారు.
చిరుతల దాడుల్లో నలుగురు మరణిస్తే కోటి రూపాయలు పరిహారంగా చెల్లించాల్సి వస్తుందని, అదే కోటి రూపాయలతో మేకలను కొని అడవుల్లోకి వదిలితే చిరుతలు జనావాసాల్లోకి రాకుండా ఉంటాయని మంత్రి అన్నారు. ప్రస్తుతం చిరుతల ప్రవర్తన, వాటి జీవన విధానాలు మారిపోయాయని అన్నారు. ఒకప్పుడు వాటిని అడవి జంతువులుగా పేర్కొన్నప్పటికీ ఇప్పుడు వాటి ఆవాసం చెరకు తోటలకు మారిందన్నారు. అహల్యానగర్, పుణె, నాసిక్ జిల్లాల్లో చిరుతల దాడులు ఇటీవల భారీగా పెరిగాయని మంత్రి చెప్పారు.