పనాజీ: గోవా రాష్ట్రంలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో జరిగిన తిరుగుబాటుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ మంగళవారం స్పష్టం చేశారు. గోవా కాంగ్రెస్ లో ‘తిరుగుబాటు’ తలెత్తిందన్నఆరోపణలపై ఆయన ఆచితూచి స్పందించారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సావంత్ ముక్తసరిగా సమాధానమిచ్చారు.
కాంగ్రెస్కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు మైఖేల్ లోబో, దిగంబర్ కామత్, కేదార్ నాయక్, రాజేశ్ ఫల్దేశాయి, దెలియాలా లోబో ఎక్కడున్నారనే సమాచారం తెలియకపోవడంతో ఆ పార్టీలో చీలక రానుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, వారంతా సోమవారం రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. తాము కాంగ్రెస్ వెంటే ఉంటున్నట్లు స్పష్టంచేశారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు గోవా వచ్చిన ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.