Nirmala Sitharaman : ప్రపంచ ఆర్థికవ్యవస్థ నిర్మాణాత్మక మార్పును చూస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. ఇలాంటి తరుణంలో బయటి నుంచి ఆకస్మికంగా తగిలే షాక్‌లను తట్టుకోవడంతో భారత్ సామర్థ్యం బలంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్ కాన్క్లేవ్-2025లో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మలాసీతారామన్ మాట్లాడుతూ.. ఆర్థిక, ఇంధన అసమతుల్యతను ఎదుర్కోవడం కూడా దేశాల ముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ సంఘర్షణలు తీవ్రమవుతున్నాయని, ఆంక్షలు, సుంకాలు, విభేదాలు ప్రపంచ సరఫరా గొలుసులను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. ఇవి భారత్‌కు కూడా దెబ్బేనని, వీటన్నింటినీ బలంగా ఎదుర్కొనే సామర్థ్యం భారత్‌కు ఉందని అన్నారు.
దేశ ఆర్థిక పరపతి కూడా అభివృద్ధి చెందుతోందని నిర్మలాసీతారామన్ చెప్పారు. యుద్ధాలు, వ్యూహాత్మక పోటీలు, సంఘర్షణ సరిహద్దులను తిరగ రాస్తున్నాయని అన్నారు. గతంలో బలంగా ఉన్న సంబంధాలు ఇప్పుడు పరీక్షలు ఎదుర్కొంటున్నాయి, కొత్త సంకీర్ణాలు ఉద్భవిస్తున్నాయని చెప్పారు. అయితే భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని, స్థిరంగా వృద్ధి చెందుతూనే ఉందని తెలిపారు. యాదృచ్ఛికంగా భారత్ ఈ స్థాయికి రాలేదని, అనేక శక్తిమంతమైన సంస్కరణల ద్వారా వచ్చిందని చెప్పారు.