న్యూఢిల్లీ: భూతాపాన్ని పెంచే నైట్రస్ ఆక్సైడ్ (ఎన్2ఓ) ఉద్గారాలు వాతావరణంలో పెరుగుతున్నాయి. 1980-2020 మధ్య వీటి పెరుగుదల 40 శాతం ఉండటం ఆందోళన కలిగించే విషయమని, ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత భారత్, అమెరికా దేశాలు ఉన్నట్టు ఒక నివేదిక వెల్లడించింది. కొందరు వాతావరణ శాస్త్రజ్ఞుల బృందంతో కూడిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు చేపట్టిన పరిశోధనల ప్రకారం 74 శాతం నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు మనం వాడే నత్రజని ఎరువులు, వ్యవసాయంలో వాడే జంతువుల ఎరువుల నుంచే విడుదలవుతున్నాయని వీరు వెల్లడించారు.
ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేసే మొదటి 10 దేశాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా ఉన్నాయి. కార్బన్డయాక్సైడ్, మెథాన్ తర్వాత అతి పెద్ద గ్రీన్హౌస్ గ్యాస్‌ల విడుదలలో నైట్రస్ ఆక్సైడ్ మూడో స్థానంలో ఉందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే ఈ గ్రీన్హౌస్ గ్యాస్‌ల కారణంగా భూతాపం 1850-1900లతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. వ్యవసాయ వ్యర్థాల నుంచి వచ్చే ఉద్గారాలు 2020లో ఇది 8 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. 1980లో ఉన్న 4.8 మిలియన్ టన్నులతో పోలిస్తే 67 శాతం అధికమని ఎర్త్ సిస్టమ్ సైన్స్ జర్నల్ ప్రచురించిన డాటాలో వెల్లడించింది.