గగనంలో విహరించే మబ్బులు.. సాగరంలో ఎగసిపడే కెరటాలు సర్వ స్వతంత్రాలు. వాటి స్వేచ్ఛకు ఎవరూ సంకెళ్లు వేయలేరు. అయితే, భూమిమీద అత్యంత తెలివిగల ప్రాణిగా చెప్పుకొంటున్న మనిషికి.. తరాలు గడిచినా బానిసత్వపు సంకెళ్ల బంధనాలు వీడట్లేదు. ఆధునిక బానిసత్వ బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటం విచారకరం.
-స్పెషల్ టాస్క్ బ్యూరో
Slavery Index | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలు ఓవైపు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్నప్పటికీ, అదేస్థాయిలో ఆధునిక బానిసత్వం కూడా పెరిగిపోతున్నట్టు మానవహక్కుల సంస్థ ‘వాక్ ఫ్రీ’ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గత ఐడేండ్లలో కోటి మంది కొత్తగా బానిసత్వంలోకి కూరుకుపోయినట్టు తెలిపింది. 2021నాటికి ప్రపంచవ్యాప్తంగా 4.96 కోట్ల మంది ఆధునిక బానిసత్వంలోకి దిగజారినట్టు వెల్లడించింది. ప్రతీ 150 మందిలో ఒకరు బానిసత్వ సంకెళ్లకు బందీగా మారారు. ఈ మేరకు ‘ప్రపంచ బానిసత్వ సూచీ-2023’ నివేదికను బుధవారం విడుదల చేసింది. బానిసత్వంలో మగ్గిపోతున్న మొత్తం 5 కోట్ల మందిలో అత్యధికంగా 1.1 కోట్ల మంది భారత్లోనే ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. పెరిగిన ధరలు, అప్పులను భరించలేక.. స్థిరమైన ఉపాధి కోసం భారత్లో నిరుపేదలు వలస వెళ్తున్నారని, ఇదే బానిసత్వానికి కారణమని అభిప్రాయపడింది. జనాభాలో భారత్తో దాదాపుగా సమానంగా ఉన్న చైనాలో 50 లక్షల మంది బానిసత్వంతో పోరాడుతున్నట్టు వివరించింది.
ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పనిచేయించడం, అక్రమంగా పనిలో నియమించుకోవడం, అప్పులు తీర్చడానికి పని చేయడం, శ్రమకు తగిన వేతనం ఇవ్వకపోవడం, అనువంశిక బానిసత్వం, బలవంతపు వివాహాలు, మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులు-విక్రయాలు తదితరాలను ఆధునిక బానిసత్వం కింద పరిగణిస్తారు. అప్పులు, ఉపాధి లేకపోవటం, అంతర్యుద్ధాలు, కరోనా వంటి ఊహించని సంక్షోభాలు ఆధునిక బానిసత్వం పెరగడానికి కారణాలుగా నివేదిక అంచనా వేసింది.
బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలోని నిరుపేదలు నిర్బంధ కార్మికులుగా బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ముఖ్యంగా బండా తదితర జిల్లాల్లోని గ్రామీణప్రాంతాలకు చెందిన పేదలు హర్యానా సమీపంలోని ఇటుకల బట్టీల్లో తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. సెలవులు లేకుండా, రోజుకు 16 గంటలపాటు వీళ్లు పనిచేస్తున్నట్టు హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. రోజుకు వెయ్యి ఇటుకలను తయారుచేయడం, వాటిని కాల్చడం, లారీల్లో లోడ్ ఎత్తడం కోసం ఒక్కో కుటుంబంలో నలుగురు పనిచేయాల్సి ఉంటుందని, అయితే ఈ నలుగురికి మొత్తంగా రోజుకు కేవలం రూ. 400 మాత్రమే చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు పారదర్శకంగా అందకపోవడం, అప్పులు పెరిగిపోవడంతోనే బుందేల్ఖండ్ గ్రామాల్లోని పేదలు నిర్బంధ కార్మికులుగా మారుతున్నట్టు ఆరోపిస్తున్నారు. ఒక్క యూపీలోనే 21 లక్షల మంది బాలకార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నట్టు చెప్పారు.