Ashrama Patashala | లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ఆశ్రమ పాఠశాలల నిర్వహణ, బాలికల పట్ల అనుసరిస్తున్న వైఖరి ఎంత దారుణంగా ఉన్నదో జయప్రకాశ్ నారాయణ్ సర్వోదయ బాలికల ఆశ్రమ పాఠశాలను చూస్తే అర్థమవుతుంది. మీర్జాపూర్ జిల్లా, మదిహాన్ తహసిల్ పరిధిలో ఉన్న ఈ పాఠశాలలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నీలం ప్రభాత్ తనిఖీలు నిర్వహించారు. విద్యార్థినుల ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని జిల్లా అధికారులను ఆమె ఆదేశించారు. ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం ఈ పాఠశాలలో విచారణ జరిపింది. కొందరు బాలికలు గర్భవతులయ్యారని, వారికి ప్రెగ్నెన్సీ(గర్భ ధారణ) కిట్లను ఇచ్చారని విద్యార్థినులు ఈ దర్యాప్తు బృందానికి చెప్పారు.
విద్యార్థినుల శానిటరీ ప్యాడ్స్‌ను పాఠశాల సిబ్బంది తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు గుట్కా తింటూ, సిగరెట్ కాల్చుతూ, విద్యార్థినులపై పొగ ఊదుతారని చెప్పారు. ఉపాధ్యాయినులు ఏసీ స్మార్ట్ క్లాస్‌రూంలో కూర్చుని మద్యం తాగుతారని, అక్కడే నిద్రపోతారని తెలిపారు. పాఠాలు చెప్పడానికి రమ్మని పిలిస్తే, తమను కొట్టి, పంపించేస్తారని ఆరోపించారు. తమకు టూత్‌బ్రష్, చెప్పులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. రెండు సంవత్సరాల నుంచి బ్యాగులు, తువ్వాళ్లు ఇవ్వలేదన్నారు. డబ్బులిస్తేనే ప్రాక్టికల్స్‌లో మార్కులు వేస్తారని తెలిపారు. విద్యార్థినుల ఆరోపణలతో కూడిన నివేదికను దర్యాప్తు బృందం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పంపించింది.